Nagababu : ట్విస్ట్ ఇచ్చిన జనసేన.. నాగబాబే ఎమ్మెల్సీ అభ్యర్థి..!
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) జరగబోతున్నాయి. ఇందులో ఒక స్థానం నుంచి జనసేన (Janasena) ప్రధాన కార్యదర్శి నాగబాబు (Nagababu) పోటీ చేస్తారని, ఆయనకు మంత్రి పదవి ఖాయమని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. అయితే రెండ్రోజులుగా నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వట్లేదని, దాని బదులు కార్పొరేషన్ ఛైర్మన్ (Corporation Chairman) పదవి ఇస్తారని కొందరు, రాజ్యసభ ఎంపీగా (Rajyasabha MP) పంపిస్తారని కొందరు చెప్తూ వచ్చారు. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ నాగబాబును అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా (Janasena MLC Candidate) ప్రకటించింది జనసేన.
ఏపీలో జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్బాబు, యనమల రామకృష్ణుడుల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. దీంతో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ దాఖలకు అవకాశముంటుంది. 11న నామినేషన్ల పరిశీలిస్తారు. 13 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఈ నెల 20న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాబలాలను బట్టి ఐదింటినీ కూటమి పార్టీలు గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ (YCP) పోటీలో నిలబడకపోవచ్చని సమాచారం.
కూటమి పార్టీల్లో ఎమ్మెల్సీ సీట్లను ఆశిస్తున్న వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అయితే జనసేన నుంచి నాగబాబుకు ఇంతకుముందే బెర్త్ ఖరారు చేశారు. వాస్తవానికి నాగబాబు గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే అనకాపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేయాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఆ స్థానాన్ని బీజేపీ తీసుకుని సీఎం రమేశ్ కు కేటాయించింది. దీంతో నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని భావించారు. అయితే అది కూడా కుదరలేదు. గత రాజ్యసభ ఎన్నికల సమయంలో నాగబాబును ఎమ్మెల్సీగా చేసి కేబినెట్ లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో తాజా ఎన్నికల్లో నాగబాబు పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మంత్రిపదవి చేపడతారని ఆశించారు.
అయితే రెండ్రోజులుగా టీడీపీ అనుకూల మీడియాలో నాగబాబుపై విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వట్లేదని.. ఆయనకు కార్పొరేషన్ పదవి ఇచ్చేందుకు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆలోచిస్తున్నారని ఓ పత్రిక రాసింది. మరో పత్రికైతే నాగబాబును రాజ్యసభకు పంపించేందుకు రంగం సిద్ధమైందని చెప్పుకొచ్చింది. ఇలా వివిధ కోణాల్లో కథనాలు రావడంతో నాగబాబుకు ఈసారి కూడా మొండిచేయి చూపించారని కొందరు విమర్శలు గుప్పించడం కూడా మొదలుపెట్టారు. అయితే వీటన్నిటికీ చెక్ పెడితూ నాగబాబును అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది జనసేన. త్వరలోనే ఆయన నామినేషన్ వేయబోతున్నారు. దీంతో ఊహాగానాలకు చెక్ పడినట్లయింది.













