సీట్ల కేటాయింపు పై ఖుషి గా లేని మెగా బ్రదర్..
జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి ఎప్పటి నుంచో జోరుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. రెండు పార్టీల మధ్య కేటాయించాల్సిన సీట్ల విషయంపై ఎందరో ఎన్నో సలహాలు ఇచ్చారు.. జనసైనికులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. అయినా లాస్ట్ కి చంద్రబాబు అనుకున్నదే జరిగింది. ఉమ్మడి జాబితాను రెండు పార్టీలు ఈరోజు విడుదల చేశాయి. ఇందులో జనసేనకు దక్కింది పాతిక శాతం సీట్లు కావడం జనసైనికులకు బాగా నిరాశ కలిగించే అంశంగా మారింది. టీడీపీ మొత్తం 94 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తూ ఉంటే జనసేన మాత్రం 24 సీట్లకే పరిమితం కావలసి వచ్చింది. అలాగే పాతిక ఎంపీ సీట్లలో జనసేనకు దక్కింది కేవలం మూడు సీట్లు మాత్రమే.
దీంతో టీడీపీ గెలిస్తే ఆంధ్రాలో జనసేన, టీడీపీ ఉమ్మడి పాలన వస్తుంది అని ఆశించిన ఎందరికో షాక్ ఎదురయ్యింది. మరి ముఖ్యంగా జనసేనకు 24 సీట్లు మూడు ఎంపీ సీట్లు కేటాయించడం మెగా బ్రదర్ నాగబాబుకి అస్సలు రుచించలేదేమో అన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే గుమ్మడిగా జరిగిన ప్రెస్ మీట్ లో నాగబాబు అతని సహజమైన బిహేవియర్ కి భిన్నంగా ఎంతో రిజర్వ్డ్ గా ఉన్నారు. ఆయన హావభావాలు, ముభావంగా ఉన్న తీరు అయీష్టతను స్పష్టంగా వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు పవన్ లతో కలిసి ఫోటో తీసుకోవడానికి పిలిచినప్పుడు కూడా ఆయన పెద్ద సంతోషంగా కనిపించలేదు.
మరోపక్క నాదెండ్ల మనోహర్ మాత్రం చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో ఎటు చెప్పలేక గుమ్మనంగానే ఉన్నాడు. జగన్ ని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు కదులుతున్న పవన్ ఈసారి టిడిపిని ఎలాగైనా గెలిపించాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే తమకు కేటాయించిన సీట్ల విషయంలో నాగబాబు మాత్రం హ్యాపీగా లేడు అని జోరుగా ప్రచారం సాగుతోంది.
రెండు పార్టీలు కలిసి సమంగా పనిచేస్తున్నప్పుడు ఆ సమానత్వం సీట్ల విషయంలో కూడా కనిపించాలి కదా. ఎక్కువ శాతం షేర్ తమ వద్ద ఉంచుకొని కేవలం పాతిక శాతం పక్క పార్టీకి కేటాయిస్తే అది సమానత్వం ఎలా అవుతుంది? అన్న ప్రశ్న ఎందరినో వేధిస్తోంది. అయితే పవన్ మాత్రం ఈ విషయంపై పెద్దగా స్పందించడం లేదు. ఎన్నికల్లో స్వలాభం కాదు ప్రజల లాభం చూడాలి అనే ఉద్దేశంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క బీజేపీ కోసం పవన్ కొంత త్యాగం చేశాడు అన్న టాక్ కూడా ఉంది. ఏదేమైనాప్పటికీ చంద్రబాబు ముందు ఎవరి పాచికలు పారవు అనడానికి ఈరోజు సీట్ల పంపిణీ మరొక నిదర్శనంగా మిగిలింది.













