‘టోఫెల్’ టెన్షన్..
ఏపీ రాజకీయాల్లో టోఫెల్ కాక పుట్టిస్తోంది. ప్రధానంగా 3 నుంచి పదోతరగతి చదివే పిల్లలకు టోఫెల్ లో విద్యాభోదనపై రాజకీయాలు తీవ్ర రూపు దాల్చాయి. ఇది రాష్ట్ర విద్యార్థుల్లో ఇంగ్లీష్ నైపుణ్యాన్ని పెంచేందుకని .., ప్రభుత్వం చెబుతుంటే, పక్కా స్కామని విపక్షాలు వాదిస్తున్నాయి. అసలు బ్రిటీష్ యాసలో ఇంగ్లీష్ మాట్లాడితేనే, అభివృద్ధి సాధ్యమని ఎవరు చెప్పారని నిలదీస్తున్నాయి.,
మరీ ముఖ్యంగా ఈ అంశాన్ని జనసేన టార్గెట్ చేసింది. ఈ వ్యవహారంలో పెద్దస్కామే జరిగిందని.. జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. టోఫెల్ శిక్షణ పేరుతో జగన్ ప్రభుత్వం భారీ కుంభకోణంకి శ్రీకారం చుట్టి ఉండవచ్చని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అనుమానం వ్యక్తం చేస్తూ దీనిపై విద్యాశాఖా మంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి బొత్స చెప్పిన లెక్కల ప్రకారం చూసుకొన్నా ఈ శిక్షణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.156 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఉదాహరణకు 10వ తరగతి విద్యార్ది టోఫెల్ శిక్షణ పూర్తి చేసుకొన్నా వెంటనే అమెరికాలో విదేశీ యూనివర్సిటీలో చేరలేడు. ఒకవేళ డిగ్రీ పూర్తిచేసిన తర్వాత చేరాలనుకొన్నా అందుకు మరో 6 ఏళ్ళు పడుతుంది. దాని కోసం మూడో తరగతి నుంచే శిక్షణ ఎందుకు? అంటే టోఫెల్ శిక్షణ పేరుతో కుంభకోణమే అని జనసేన వాదిస్తోంది.
విద్యా వ్యవస్థలో స్కాంలు జరుగుతున్నాయని జనసేన ఆరోపించడంపై మంత్రి బొత్స స్పందించారు. టోఫెల్ విద్యా విధానంపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్దేశ్యం తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు ఇస్టారాజ్యంగా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. టోఫెల్ లో 4500 కోట్లు స్కాం అని నాదెండ్ల మనోహర్ అంటున్నారని.. ఇందులో స్కాం ఎక్కడ ఉందో మనోహర్ చూపించాలని డిమాండ్ చేశారు మంత్రి బొత్స.
ఈ టోఫెల్ వివాదంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ‘‘ఆంగ్ల మాధ్యమంపై మాట్లాడితే ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకం అంటారు. కాలేజీ స్థాయిలో ఇవ్వాల్సిన టోఫెల్ శిక్షణ 3వ తరగతి వారికి ఎందుకు? కేవలం ఇంగ్లీష్ మాట్లాడటం కోసమే అయితే.. ఇంటర్నెట్లో చాలా వెబ్సైట్లు ఉన్నాయి. బ్రిటిష్ యాసలో ఇంగ్లీష్ మాట్లాడితే గొప్పని ఎవరు చెప్పారు? భారత రత్న అబ్దుల్ కలాం గారి ఇంగ్లీష్ మన యాసలోనే ఉంటుంది. మంత్రి బొత్స ఏం ఇంగ్లీష్ మాట్లాడతారని మంత్రి అయ్యారు. ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే అద్భుతాలు జరిగితే అమెరికాలో పేదలే ఉండకూడదు. బ్రిటన్, న్యూయార్క్ వంటి దేశాల్లో ఎవరూ రోడ్ల వెంట తిరిగేవారు కాదన్నారు.
ఐబీ సిలబస్ పెట్టడం వెనుక వేరే కుంభకోణం ఉందన్నారు పవన్. ఒప్పందం జరిగిన తర్వాత ఏదైనా తేడా వస్తే మనం స్విట్జర్లాండ్లో కోర్టుకు వెళ్లి దావా వేయాలి. వీటిపై మంత్రి బొత్స సమాధానం చెప్పాలి. 2024లో వైసీపీ ప్రభుత్వం దిగిపోయాక విద్యావ్యవస్థలో జరిగిన అవినీతిపై సమీక్షిస్తాం. ఇలాంటి అవకతవకలపై తప్పకుండా విచారణ జరిపిస్తామన్నారు. దేశంలో ఐబీ సిలబస్ స్కూళ్లు 1200 మాత్రమే ఉన్నాయి. ఐబీ సిలబస్ వెనక తప్పకుండా స్కాం ఉంది’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.













