వారంతా వైసీపీ నుంచి బయటకు రావాలి ..మాతో కలిసి
ఆత్మగౌరవంతో ఉన్న వారంతా వైసీపీ నుంచి బయటకు రావాలని, మాతో కలిసి ముందుకు నడవండి అంటూ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అహంభావానికీ, ఆత్మగౌరవానికి జరిగే పోరాటంలో చివరికి గెలిచేది ఆత్మగౌరవమేనని అన్నారు. సీఎం జగన్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని అహంకారంతో సినిమా థియేటర్ల వద్ద కర్ఫ్యూ వాతావరణాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. ప్రజా సమస్యలు తీరుస్తారని నమ్మి అధికారం ఇస్తే జగన్ ఇలాంటి పాలన అందిస్తారని ఎవరూ ఊహించి ఉండరని అన్నారు. భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద జరిగిన సంఘటనలు చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయిందన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తామని, పెట్టుబడులు పెడితే ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని గతంలో సీఎం చెప్పారని అన్నారు.
పవన్ కల్యాణ్ సినిమా విడుదల సందర్భంగా ప్రతి సినిమా థియేటర్ వద్ద ప్రభుత్వ సిబ్బందిని ఉపయోగించి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా కుట్ర చేయడం సిగ్గుచేటు అన్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన రెవెన్యూ సిబ్బంది బాధ్యతలను పక్కన పెట్టించి వేకువజామున వీళ్లందరినీ సినిమా థియేటర్ల వద్దకు పంపించారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మే వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. పవన్‌కల్యాణ్ నాయకత్వంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ చూపిద్దాం అని అన్నారు. భీమ్లానాయక్ చిత్రం విడుదల సమయంలో ప్రభుత్వం నుంచి ఎన్నో ఒత్తిళ్లు, అవమానాలు ఎదురైనా పవన్ అభిమానులు హుందాగా ప్రవర్తించారని ఈ సందర్భంగా జనసైనికులను అభినందించారు.













