ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరిగే వరకు పోరాటం : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా కాకాని వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జేఎన్టీయూ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం జేఎన్టీయూ భవనాల నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా నష్టపోయిందని, తెలుగు జాతికి అన్యాయం జరిగితే ఊరుకోబోమని సృష్టం చేశారు. రాష్ట్రానికి న్యాయం చేయాలనే బీజేపీతో ఆ రోజు పొత్తుపెట్టుకున్నట్టు తెలిపారు. విభజన హామీలను నెరవేర్చాలని కోరుతూ తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేవన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగేవరకు న్యాయం చేయాలని కోరారు. ఆ రోజు ఇచ్చిన హామీలన్నంటినీ నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. అందరి సహకారంతో రాష్ట్ర హక్కులను సాధించుకోవాలన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలన్నింటీని నెరవేర్చాల్సిందేనని అన్నారు.













