విశాఖలో కరోనా విజృంభణకు కారణం కొత్త వేరియంటా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా భారీగా విస్తరించడానికి కారణం ఏంటి? ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? తాజాగా వినిపిస్తున్న సమాధానం కొత్త వేరియంట్. అయితే ఏపీలో ప్రస్తుత పరిస్థితితులకు ఈ వేరియంటే కారణం అని అప్పుడే చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. కానీ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మోలిక్యూల్ బయాలజీ (సిసిఎంబి) సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రకం కరోనా వేరియంట్‌ను కనుగొంది. దీనికి ఎన్440కె అని నామకరణం చేసింది. ప్రస్తుతం విశాఖ పట్టణంలో కనిపిస్తున్న కరోనా కల్లోలానికి ఈ వేరియంటే కారణమని సమాచారం. ఇది సాధారణ కరోనా కన్నా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కరోనా మొదటి వేవ్ సమయంలో వెలుగు చూసిన వైరస్ కన్నా ఇది కనీసం 15 రెట్లు శక్తిమంతమైనదని తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం భారత్‌లో కరోనా కల్లోలానికి కారణమైన బి1.617, బి1.618 కరోనా వేరియంట్ల కన్నా ఆంధ్రప్రదేశ్‌లో కనిపించిన వైరస్ బలమైనది అయ్యుండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో కరోనా సోకిన వ్యక్తి హైపాక్సియా లేక డిస్పెనియా దశకు చేరుకోవాలంటే వారం రోజులు పట్టేదని, ఈ కొత్త వేరియంట్ వల్ల మూడు, నాలుగు రోజుల్లోనే విషమ పరిస్థితులకు చేరుకుంటున్నారని విశాఖపట్టణం డిస్ట్రిక్ట్ కొవిడ్ ప్రత్యేక అధికారి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ పి.వి. సుధాకర్ వెల్లడించారు. ప్రస్తుతం విశాఖలో ఏ వేరియంట్ ఉందో చెప్పడానికి సరైన ఆధారాలు లేనప్పటికీ, ఇక్కడ కనిపిస్తున్న వైరస్ మాత్రం మిగతా వేరియంట్లకు భిన్నంగా ఉందని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ పేర్కొన్నారు. తొలిసారి కర్నూలులో ఈ వేరియంట్ వెలుగు చూసింది. అందుకే దీన్ని ఏపీ వేరియంట్ అని కూడా పిలుస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యానికి ఈ వేరియంటే కారణమైతే మాత్రం పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ఈ ఏపీ వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తోందని, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని, ఇళ్ల నుంచి సాధ్యమైనంతగా బయటకు రావొద్దని, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని, ఎక్కువ మంది గుంపులుగా కలవొద్దని హెచ్చరిస్తున్నారు.