రణరంగంగా మారుతున్న ఏపీ రాజకీయాలు..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకి కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మాటల యుద్ధాలు మాని ఇప్పుడు నేరుగా హత్యాయత్నాల వరకు రాజకీయాలు వెళ్తున్నట్లు అనిపిస్తోంది. తెలుగుదేశం శ్రీకాళహస్తి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి పై హత్యాయత్నం జరిగినట్లు ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. శ్రీకాళహస్తిలో బహదూర్ పేట ఐదవ వార్డులో సుధీర్ రెడ్డి ప్రచారం సాగిస్తున్న సమయంలో సెల్ఫీ దిగాలి అంటూ మహేష్ కుమార్ ముందుకు వచ్చాడు. మహేష్ కుమార్ మద్యం పుచ్చుకున్నట్టు అనుమానం కలగడంతో కార్యకర్తలు అతని తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో అతని వద్ద ఓ కత్తి దొరికింది. దీంతో కార్యకర్తలు వెంటనే అతడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారించగా.. తాను బహదూర్ పేట లోని జాతరకు వచ్చానని.. ఆత్మరక్షణ కోసం కత్తి దగ్గర ఉంచుకున్నాను అని అతను చెబుతున్నాడు. మరోపక్క అతను సుధీర్ బాబుని హత్య చేయడానికి వచ్చాడు అని.. అతను వైసీపీ సానుభూతిపరుడని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ కేసు విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.













