ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తిన అంబానీ
సాంకేతిక ఫలాలను మారుమూల గ్రామాలకు తీసుకెళ్లి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చేస్తున్న కృషి తనను ముగ్ధుడిని చేసిందని రిలయెన్స్ పారిశ్రామిక సామ్రాజ్యాధిపతి ముకేశ్ అంబానీ అన్నారు. మంగళవారం సాయంత్రం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చేరుకున్న అంబానీ, వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘రియల్ టైమ్ గవర్నెన్స్’ కేంద్రాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీ ప్రజెంటేషన్‌కు స్పందిస్తూ ‘ఈ వినూత్న ప్రయోగాన్ని చూస్తుంటే సంతోషంగా ఉంది. స్ఫూర్తిదాయకంగానూ ఉంది.మీలాంటి సమర్ధుడైన నాయకుడు మరింత పెద్ద హోదాలో ఉంటే అద్భుత ఫలితాలు ఒనగూరతాయి’ అని ముకేశ్ అంబానీ సీఎంను ప్రశంసించారు.
ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ-ఆఫీసు విధానం దేశమంతా అమలులోకి తేవాల్సి ఉందని, చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రియల్ టైమ్ గవర్నెన్స్ విధానం దేశంమంతా విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, మేధోపరమైన హక్కులను మీరు పొంది మీ బృందమే అన్ని రాష్ట్రాలలో ఈ విధానం అవలంబించేందుకు శిక్షణనిచ్చి మార్గదర్శనం చేయవచ్చు’ అని ముకేశ్ అంబానీ సూచించారు.
ఇటీవల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానిని వెళ్లి రియల్ టైమ్ గవర్నెన్స్‌ను పరిశీలించాలని విజ్ఞప్తిచేస్తే తనకు ఆసక్తి కలిగిందని, ఇప్పుడు సందర్శించే అవకాశం వచ్చిందని పారదర్శక పరిపాలన, జవాబుదారీతనంతో ప్రభుత్వాలు వ్యవహరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న రియల్ టైమ్ విధానం అపూర్వమన్నారు. రెవెన్యూ విభాగంలో తీసుకొచ్చిన సంస్కరణలను ప్రధానంగా భూవివరాలను ఆన్లైన్ లో వుంచిన విధానం, భూదార్లపై అంబాని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ లో మంగళవారం భూగర్భజలాలు సగటున 11.3 మీటర్ల స్థాయిలో ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించినప్పుడు ముకేశ్ అంబానీ ప్రశంసాపూర్వకంగా చూశారు. అన్ని నగరాల్లో ఐఓటీ సాంకేతికత ఆధారంగా సెన్లర్లతో కూడిన వీధిదీపాల వ్యవస్థను ఏర్పాటు చేశామని, సీఎం కోర్ డ్యాష్ బోర్డుకు అనుసంధానం చేశామని తెలిపారు. గాలిలో స్వచ్ఛత ఎంత ఉంది? కాలుష్యం ఎంత? రిజర్వాయర్లలో నీటిమట్టాల స్థాయి ఎంత ఉందో రియల్ టైమ్ విధానంతో తాను స్వయంగా పరిశీలిస్తూ తగిన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ‘ప్రజలే ముందు’ అంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తొలిప్రాధాన్యతనిస్తూ, ఇందుకోసం ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ఫిర్యాదు కోసం 1100 కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని చంద్రబాబు తెలిపారు. తమ రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రానికి రోజుకు 1.5 మిలియన్ ఫోన్ కాల్స్ స్వీకరించే సామర్ధ్యం ఉందన్నారు. ఇలా వచ్చిన కోటి 47 లక్షల ప్రజా సమస్యలను పరిష్కరించామన్నారు. పౌరుడు తాను చేసిన ఫిర్యాదుకు సరైన స్పందన లభించిందని, సమస్య పరిష్కారమైందని భావిస్తేనే ఆ ఫిర్యాదును మూసివేస్తామని, లేకుంటే మళ్లీ తిరిగి తెరిచి పరిష్కార ప్రక్రియ చేపడుతున్నట్లు ముకేశ్ అంబానికీ ఆర్టీజీ ప్రత్యేకతను వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ విభజన తరువాత తమ రాష్ట్రాన్ని అనేక సమస్యలు చుట్టుముట్టాయన్నారు. రాజధానిలేక, ఆదాయం లేక, రూ.16 వేల కోట్ల ద్రవ్యలోటుతో, మరోవైపు 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తులోటు నవ్యాంధ్రప్రదేశ్ ప్రస్థానం ప్రారంభమైందని వివరించారు. తాము స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించి 2022 నాటికి ఏపీని దేశంలో మూడు అభివృద్ధి చెందిన అగ్రగామి రాష్టాలలో ఒకటిగా, 2029 కి దేశంలో నెంబర్-1గా, 2050 కి ప్రపంచ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని రెప్పారు. ఏడు మిషన్లు ఐదు గ్రిడ్లు, ఐదు ఉద్యమాలకు రూపకల్పన చేసి ప్రధాన దృష్టికేంద్రీకరణతో ముందుకు సాగుతున్నామని చంద్రబాబు వివరించారు. ఎన్ని అవరోధాలున్నా నాలుగేళ్ల పరిపాలనలో తమ విధానాలతో పరిపాలనపై, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తిస్థాయి సంతృప్తిని సాధించడం ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఐదు భద్రతల కల్పనకు ప్రాధాన్యతనిచ్చామని, జలవనరుల రంగంమీద దృష్టి పెట్టామని అన్నారు. పరిపాలనలో ఈ నవ్య ప్రయోగం, నవ్య విధానం తనకు ఎంతో ఆశ్చర్యంగా ఉందని ముకేశ్ అంబానీ అన్నారు. ప్రపంచంలో సుపరిపాలనకు ఎస్టోనియాను ఒక నమూనాగా భావిస్తారని, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాలను చూశాక అధ్యయనానికి ఎస్టోనియా సీఈఓ, ఆయన బృందమే ఇక్కడికి రావాలి’ అని ముకేశ్ అంబానీ కితాబునిచ్చారు.













