Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభ రెడ్డికి క్యాన్సర్.. కుమార్తె వెల్లడి..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) కీలక వ్యక్తిగా, కాపు ఉద్యమ నేతగా పేరొందిన ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) క్యాన్సర్ తో పోరాడుతున్నారని ఆయన కుమార్తె క్రాంతి (Kranthi) ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. దీంతో.. ముద్రగడ ఆరోగ్యంపై చర్చ జరుగుతోంది. ముద్రగడ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆయనకు సరైన వైద్యం అందకుండా కుమారుడు గిరి అడ్డుకుంటున్నారని క్రాంతి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ముద్రగడ పద్మనాభ రెడ్డి గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో కీలక పదవులు నిర్వహించారు. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో చేరారు. ఆయన ప్రస్తుతం క్యాన్సర్‌తో పోరాడుతున్నారని కుమార్తె క్రాంతి వెల్లడించారు. ముద్రగడకు అత్యవసరంగా వైద్య చికిత్స అందించాల్సి ఉందని.. అయినా.. కుమారుడు గిరి ఉద్దేశపూర్వకంగా చికిత్సను నిరాకరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం ఆమెను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని క్రాంతి తెలిపారు.
క్రాంతి ఆరోపణలు ముద్రగడ కుటుంబంలో విభేదాలను మరోసారి బయటపెట్టాయి. గిరి తన తండ్రి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, చికిత్సకు అడ్డుపడుతున్నారని క్రాంతి వెల్లడించారు. అంతేకాకుండా, వైసీపీ నాయకులు ముద్రగడను కలవడానికి వచ్చినప్పుడు కూడా గిరి వారిని అడ్డుకున్నారని క్రాంతి ఆరోపించారు. ఇటీవల ఓ మాజీ వైసీపీ ఎమ్మెల్యే ముద్రగడను కలవడానికి ప్రయత్నించినప్పుడు.. గిరి, ఆయన అత్తగారు అడ్డుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ విభేదాలు కేవలం ఆరోగ్య సంబంధిత విషయాలకే పరిమితం కాలేదు. గతంలో కూడా ముద్రగడ కుటుంబంలో రాజకీయ భేదాభిప్రాయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా 2024 ఎన్నికల సమయంలో క్రాంతి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతు ప్రకటించారు. ముద్రగడ వైసీపీ తరపున ప్రచారం చేశారు. దీంతో అప్పుడే కుటుంబ విభేదాలు బయటికొచ్చాయి.
ముద్రగడ వైసీపీలో చేరిన తర్వాత ఆయన పార్టీ కోసం చురుకైన పాత్ర పోషించారు. 2024 ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడిస్తానని సవాల్ విసిరి, ఓడిపోతే పేరు మార్చుకుంటానని ప్రకటించారు. పవన్ గెలవడంతో ఆయన తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. ముద్రగడ కాపు ఉద్యమ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనకు క్యాన్సర్ సోకిందని కుమార్తె చెప్పడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.