ముగిసిన ముద్రగడ “కాపు”రం…
దశాబ్ధాల తరబడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం తరపున ఏకైక స్వరంగా ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం అస్త్ర సన్యాసం చేసేశారు. వంగవీటి మోహనరంగా తో కలిసి కాపునాడు వంటి బలమైన ఉద్యమాలను నిర్మించిన ఆయన ఇక తాను కాపు ఉద్యమ సారధిగా ఉండలేనని చెప్పేశారు. ఈ మేరకు సోమవారం కాపు సామాజిక వర్గాలకు మాజీ మంత్రి ముద్రగడ బహిరంగ లేఖ రాశారు. ఇక తాను కాపు ఉద్యమం నుండి తప్పుకోవాలని నిర్ణయించు కొన్నానని ఆయన లేఖలో స్పష్టం చేశారు.. ఇటీవల కొంతమంది సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ల ద్వారా తనపై దాడులు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తనను కులద్రోహి గజదొంగ వంటి మాటలతో విమర్శిస్తున్నారన్నారు. గతంలో ఒంటి కాలి పై లేచేవాడు ఇప్పుడు రెండు కాళ్ళు చల్లబడిపోయాయా అంటూ తనపై కామెంట్ పెట్టడం బాధనిపిస్తుందన్నారు. తాను ఉద్యమంలో వసూలు చేసిననిధులు వారికి పంచలేదనేమో ఆ దాడులు? అంటూ వ్యాఖ్యానించారు. తాను ఉద్యమాన్నిఅంత బలంగా ముందుకు నడిపించడానికి కారణం నాటి సిఎం చంద్రబాబే నన్నారు. ఉద్యమము సందర్భాలను బట్టి రూపురేఖలు మార్చుకొంటుంది.. మేథావులతో కలిసి తాను ఉద్యమం నడిపానన్నారు. జాతికి ఏదో విధముగా మేలు జరగాలని ఎన్నో ప్రయత్నాలు చేశానని చెప్పారు. ఉద్యమం ద్వారా ఆర్ధికంగా రాజకీయంగా, ఆరోగ్య పరంగా నష్టపోయానన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక ఉద్యమాన్ని నడిపించలేనని తేల్చి చెప్పారు.













