Mudragada Padmanabham: ఇప్పుడు మీరు..రేపు మేము.. భవిష్యత్తు పై ముద్రగడ్డ వైరల్ జోస్యం..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు (Chandra Babu) నాలుగోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. టీడీపీ(TDP) కూటమిలో రెండవ అతిపెద్ద పార్టిగా ఉన్న జనసేన (Jansena) కూడా ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటోంది. ఇదే సమయంలో, టీడీపీ కూటమి భవిష్యత్తుపై నేతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. 2029 ఎన్నికల్లో టీడీపీ కూటమి నెగ్గి అధికారంలోకి వస్తుందని, వైసీపీకి తిరిగి అధికారం దక్కే అవకాశమే లేదని కూటమి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తుంటే.. ఈ సారి గెలుపు తమదే అన్న ధీమా తో వైసీపీ (YCP) ముందుకు సాగుతుంది.
అయితే, రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చంద్రబాబుకు రాసిన లేఖ ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముద్రగడ తన లేఖలో “రెడ్ బుక్” అనే అంశాన్ని ప్రస్తావిస్తూ, రాజకీయ ప్రత్యర్థులను వేధించడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే టీడీపీ కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చంద్రబాబును సూచించారు.
ముద్రగడ తన లేఖలో చంద్రబాబుతో ఉన్న గత సంబంధాలను గుర్తు చేసుకున్నారు. 1978లో తాను, చంద్రబాబు, వైఎస్సార్ ఒకే సమయంలో అసెంబ్లీకి అడుగుపెట్టామని, అప్పట్లో రాజకీయాల్లో స్నేహభావం ఉండేదని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రత్యర్థులను వేధించడం రాజకీయాల్లో జరుగుతున్న తప్పిదమని ముద్రగడ అభిప్రాయపడ్డారు.
ఆయన చేసిన వ్యాఖ్యల ప్రకారం, ఏపీ రాజకీయాల్లో శాశ్వతంగా ఎవరూ అధికారంలో ఉండలేరు. నేడు టీడీపీ కూటమి అధికారంలో ఉన్నా, రేపు వైసీపీ మళ్లీ అధికారంలోకి రావచ్చు. ఆ సమయంలో కూడా ఈ విధమైన చర్యలు జరిగితే, అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. ముద్రగడ లేఖలో జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తారని ఊహించడం వైసీపీ శ్రేణులను ఉత్సాహపరచింది. ఈ లేఖ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. టీడీపీ నేతలు ఈ లేఖపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ముద్రగడ లేఖ ద్వారా రాజకీయ వేధింపులపై ఆయన స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. గతంలో రాజకీయాలు స్వచ్ఛంగా ఉండేవని, ప్రత్యర్థులను గౌరవించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఈ లేఖ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముద్రగడ చెప్పిన మాటలు టీడీపీకి చిత్తశుద్ధి సూచనలు అయితే, వైసీపీకి జోస్యం లాంటివిగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలకు ఎంత ప్రభావం చూపుతాయో వేచిచూడాలి.













