కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేవారికే మద్దతు
కాపులకు పూర్తిస్థాయి రిజర్వేషన్లు కల్పించే వారికే తమ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కాపు సంఘాల నాయకులు నిర్ణయించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై మాజీమంత్రి ముద్రగడ్డ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు ఐకాస నేతలు, జిల్లాల కాపు సంఘాల నాయకులతో చర్చించారు. వైకాపా అధ్యక్షుడు జగన్ జగ్గంపేట, పిఠాపురం సభల్లో కాపుల రిజర్వేషన్లకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. అసలు జగన్ను కాపులకు రిజర్వేషన్లు ఇమ్మని ఎవరడిగారని ఐకాస నాయకులు ముద్రగడ వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపుల రిజర్వేషన్లు అంశంపై కేంద్రంతో పోరాడాలని టీడీపీ ఎంపీలకు చెప్పడంపైనా చర్చించారు. దీనిపై ముందే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్లు దక్కేవరకు పోరాడాలని తీర్మానించారు.













