ముద్రగడ, చేగొండి ముసుగులు తొలగిపోతున్నాయా…?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాపుల పాత్ర ఎంతో కీలకం. అందుకో ఆ సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసుకునేందుకు రాజకీయ పార్టీలు ఎన్నో ఎత్తుగడలు వేస్తుంటాయి. వాళ్లకు వివిధ రకాలుగా తాయిలాలు ప్రకటిస్తుంటాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీలన్నీ వాళ్ల ప్రాపకం కోసం ఎగబడుతున్నాయి. కాపు పెద్దలుగా చెప్పుకునే లీడర్లను తమవైపు తిప్పుకునేందుకు ట్రై చేస్తున్నాయి. తాజాగా ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్య లాంటి వాళ్లను తమ పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ సిద్ధమైంది. అయితే ఇన్నాళ్లూ ఎన్నో డ్రామాలు ఆడిన వీళ్లిద్దరూ ఇప్పుడు వైసీపీకి చేరువ కావడంతో ముసుగులు తొలగిపోయాయనే భావన వ్యక్తమవుతోంది.
ముద్రగడ పద్మనాభం మొదటి నుంచి వైసీపీ అనుకూలురుగానే పేరొందారు. టీడీపీ హయాంలో ఆ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టారు. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించారు. అది రత్నాంచల్ ఎక్స్ ప్రెస్ దహనం వరకూ వెళ్లింది. ఎట్టకేలకు దిగొచ్చి చంద్రబాబు రిజర్వేషన్లు కల్పించారు. అయినా ఆగని ముద్రగడ తనదైన శైలిలో పోరాటం కొనసాగిస్తూనే వచ్చారు. దీంతో ఆయన్ను గృహనిర్బంధం చేసింది అప్పటి ప్రభుత్వం. ఈ ఉద్యమ సమయంలోనే ఆయన వైసీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపించింది. ప్రభుత్వం మారిన తర్వాత జగన్ అధికారంలోకి వచ్చారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమం సమయంలో పెట్టిన కేసులన్నింటినీ రద్దు చేశారు. పైగా రిజర్వేషన్లు అమలు చేయలేక జగన్ చేతులెత్తేసినా ముద్రగడ నోరు విప్పలేదు. దీంతో ఆయన జగన్ మనిషే అని అర్థమైపోయింది.
ఇప్పుడు ముద్రగడ పద్మనాభం వైసీపీ కండువా అధికారికంగా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. కొంతకాలం కిందట చేరబోయి చివరి నిమిషంలో అది బెడిసి కొట్టింది. దీంతో జనసేలో చేరేందుకు చర్చలు జరిపారు. కానీ పవన్ కల్యాణ్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో వెనక్కు తగ్గారు. ఇప్పుడు వైసీపీ నుంచి పిలుపు రావడంతో భేషరుతుగా చేరబోతున్నట్టు ప్రకటించారు.
ఇక చేగొండి హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సేన పేరుతో ఒక కూటమి కట్టారు. కాపులందరికీ తానే ప్రతినిధిననేది ఆయన ఉద్దేశం. అంతటితో ఆగకుండా కాపులందరికీ పవన్ కల్యాణే దేవడని.. ఆయనే కాపాడతారనేది చేగొండి భావన. అందుకే పవన్ కల్యాణ్ ను చేయి పట్టి నడిపిస్తానని.. తను చెప్పినట్టు నడుచుకోవాలని ఆయన ఉద్దేశం. అందుకోసం ఆయన పవన్ కల్యాణ్ కు రోజుకో బహిరంగ లేఖ రాసేవారు. చంద్రబాబుతో కలవద్దు.. కలిస్తే 90 సీట్లు అడుగు.. సీఎం పదవి అడుగు.. ఇలా ఏవోవో సూచనలు చేసేవారు. చిర్రెత్తుకొచ్చిన పవన్ కల్యాణ్.. తనకు ఎవరి సలహాలూ అక్కర్లేదని కుండబద్దలు కొట్టేశారు. అయినా చేగొండి మాత్రం లేఖల పరంపర ఆపలేదు. అయితే ఇంతలోనే ఆయన కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ తాడేపల్లి వెళ్లి జగన్ ను కలిసి ఆ పార్టీ కండువా కప్పేసుకున్నారు. దీంతో చేగొండి లేఖల వెనుక వైసీపీ ఉందని అర్థమైపోయింది. ఇలా ఇద్దరు కాపు నేతల ముసుగు తొలిగిపోయిందని జనం చర్చించుకుంటున్నారు.













