ఆ ఇద్దరికి ఏమైంది..?
టీడీపీకి కంచుకోటల్లాంటి జిల్లాలు కృష్ణా, గుంటూరు. జగన్ ప్రభంజనంలో సైతం గుంటూరు, విజయవాడ పార్లమెంట్ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలను దాదాపు స్వీప్ చేస్తామన్న ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రస్తుతం ఆ రెండు జిల్లాల్లో యువనేత నారా లోకేష్ పాదయాత్ర జరుగుతోంది. కానీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని లోకేష్ యాత్రకు ముఖం చాటేయడం హాట్ టాపిక్ గా మారింది. లోకేశ్ యువగళం యాత్రకు కీలకమైన ఇద్దరు ఎంపీలు దూరంగా ఉండడం.. తెలుగుదేశం శ్రేణులను సైతం గందరగోళంలో పడేస్తోంది. ఇంతకూ ఆ ఇద్దరూ ఎందుకు దూరంగా ఉన్నారు?
విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. పార్టీ నాయకత్వంపై బాహటంగానే ఆయన విమర్శలకు దిగుతున్నారు. చెత్త నాయకులకు లోకేష్ ప్రోత్సాహం అందిస్తున్నారని కేశినేని నాని తరచూ కామెంట్స్ చేస్తున్నారు. బుద్దా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమాలకు లోకేష్ అండదండలు ఉన్నాయని.. పైగా తనపై తన తమ్ముడు కేశినేని చిన్నిని ప్రయోగిస్తున్నారని నాని ఆగ్రహంగా ఉన్నారు. అందుకే లోకేష్ యాత్రకు తాను వెళ్లడం లేదని అనుచరుల వద్ద చెప్పుకొస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ నేతలతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏపార్టీ వాళ్లు చేసినా.. తప్పక అభినందించాలంటున్నారు. ముఖ్యంగా తనతమ్ముడినే తనపై ప్రయోగిస్తున్నారన్న కోపం కేశినేని నానిలో కనిపిస్తోంది.
అటు గల్లా జయదేవ్ వ్యవహార శైలి కూడా చర్చనీయాంశంగా మారింది. పార్టీకి ఆంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే కేశినేని నాని మాదిరిగా ఎక్కడా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం లేదు. రెండోసారి గెలిచిన తర్వాత ఆయన చాలా యాక్టివ్ గా పని చేశారు. అమరావతి కి మద్దతుగా లోక్ సభలో బలమైన వాయిస్ ని వినిపించారు. జగన్ సర్కార్ అమర్ రాజా గ్రూప్ కంపెనీస్ పై అణచివేత ప్రారంభించిన తర్వాత యాక్టివ్ పాలిటిక్స్ ను తగ్గించారు. ఆయన వైసీపీలో చేరుతారని.. ప్రో వైసిపి సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ గల్లా కుటుంబం టిడిపిలోనే యాక్టివ్ గా ఉంది. జయదేవ్ తల్లి అరుణకుమారి వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయినా సరే జయదేవ్ కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
అయితే కేశినేని వ్యవహారంపై ఆచితూచి స్పందిస్తున్న జిల్లానేతలు.. గల్లా విషయాన్ని ప్రస్తావించడం లేదు. ఆయన అమర్‌రాజా కంపెనీ వ్యవహారాల్లో బిజీగా అయ్యారా? ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకొచ్చిన గొడవని తెరవెనక్కు వెళ్లారా అన్న చర్చ కూడా కొనసాగుతోంది. ఏదేమైనా కీలకమైన నేతలు గైర్హాజరవుతుంటే వారి అభిప్రాయాలు తెలుసుకుని.. జనంలోకి తీసుకు రావాల్సింది పోయి..రాకున్నా పర్వాలేదన్నట్లుగా హైకమాండ్ వ్యవహరించడం సరికాదన్న వాదన.. టీడీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మరి దీన్ని హైకమాండ్ ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.













