ప్రజలకు పవర్ కట్ చేస్తే.. వచ్చే ఎన్నికల్లో మన పవర్ కట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు పవర్ (విద్యుత్) కట్ చేస్తే, వచ్చే ఎన్నికల్లో ప్రజలు మన పవర్ (అధికారం) కట్ చేస్తారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్నటివరకు జగనన్న విద్యుత్ వాతలతో బాధపడితే ఇప్పుడు జగనన్న విద్యుత్ కోతలతో జనం అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ప్రభుత్వ పరిపాలన రాహిత్యం, అవగాహనాలోపం వల్లే రాష్ట్రంలో విద్యుత్ రంగం చతికిలపడిరదని విమర్శించారు. గృహ అవసరాలకు చెందిన ఎలక్ట్రానిక్ యంత్రాలేవీ ఇళ్లల్లో వినియోగించవద్దంటూ సకల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హితవచనాలు పలికారు. రాష్ట్రంలో చీకటి రోజులు వస్తాయేమోనని అన్నారు. ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో సమస్యలు వస్తున్నాయన్నారు. బొగ్గుకు ఎలాంటి లోటు లేదని కేంద్ర మంత్రి ప్రకటిస్తే, అది అబద్ధమని సజ్జల చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.













