ఎంపీ కిడ్నాప్ వెనక లోగుట్టు..?
విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఎంపీ భార్య , కుమారుడితో పాటు ప్రముఖ ఆడిటర్ జీవిని కిడ్నాప్ చేశారు. రుషికొండ సమీపంలో ఎంపీ ఇంటిలోకి వెళ్లి మరీ… ఎంపీ భార్య, కుమారుడ్ని కిడ్నాప్ చేశారు.. తర్వాత వారి ద్వారా ఆడిటర్ జీవీని కూడా పిలించి ..ఆయనను కూడా కిడ్నాప్ చేశారు. అయితే ఈఘాతుకానికి పాల్పడింది రౌడీషీటర్ హేమంత్ అని ఎంపీ సత్యన్నారాయణ చెబుతున్నారు.
ఎంపీతో పాటు ఆడిటర్ జీవీ ఇద్దరూ వైఎస్ఆర్సీపీ నాయకులే కావడంతో.. ఈ కిడ్నాప్ వ్యహహారం వివాదాస్పదం అయ్యే చాన్స్ ఉండటంతో.. పోలీసులు కూడా గుంభనంగా ఉన్నారు. ఎంపీ ఎంవీవీ వర్గీయులు మాత్రం ఈ ఘటన వెనుక రౌడీషీటర్ హేమంత్ ఉన్నారని చెబుతున్నారు. అంతే కాదు గంజాయిమత్తులో నిందితుడు.. ఈఘటనకు పాల్పడ్డారంటున్నారు. ఎంపీ కుటుంబసభ్యుల్నే కిడ్నాప్ చేసేంత ధైర్యం ఓ సాధారణ రౌడీషీటర్ ఎందుకు చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింంది.
మరోవైపు… వైసీపీ పెంచిన పామే కాటేసిందని టీడీపీ సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ నేరరాజధానిగా మారుతోందని సాక్షాత్తూ కేంద్రహోంమంత్రి ప్రకటించిన తర్వాతి రోజే.. ఎంపీ కుటుంబం కిడ్నాప్ కావడం… పరిస్థితికి అద్దం పడుతోందంటున్నాయి. ఇక బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అయితే.. ఈ వ్యవహారంలో కేంద్రదర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తే అసలు సంగతి బయటకు వస్తుందంటున్నారు. ఏపీ డీజీపీ సహా పోలీసులు ఎన్ని చెప్పినా.. ఈఘటనతో విశాఖలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందన్న వాస్తవం ప్రపంచానికి స్పష్టమైందని చెప్పొచ్చు..
మరో వైపు ఎంపీ కుటుంబసభ్యులను ఇంట్లో నుంచే కిడ్నాప్ చేయడం సంచలనం సృష్టించిది. అదీ కూడా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామంటూ … వైసీపీ నేతలు ప్రకటిస్తున్న పట్టణంలో ఓ ఎంపీ కుటుంబసభ్యుల్ని పట్టపగలు కిడ్నాప్ చేయడం చిన్న విషయం కాదని.. రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. పూర్తిస్థాయి విచారణను నిష్పాక్షికంగా జరిపిస్తే అసలు వాస్తవాలు వెలుగుచూస్తాయంటున్నారు. అయినా ఇంత జరుగుతున్నా పోలీసు వ్యవస్థ ఎందుకు గుర్తించలేకపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.













