విశాఖను ఐటీ హబ్ గా అభివృద్ధి చేయండి : జీవీఎల్
విశాఖను దేశంలోనే ప్రధాన ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్‌ను కలిసిన ఎంపీ జీవీఎల్ పలు అంశాలపై వినతి పత్రం అందించారు. విశాఖలో అవసరమైన వ్యవస్థను, ఇంకా వివిధ ఐటీ ప్రాజెక్టుల అనుమతుల మంజూరు, వాటి అమలును వేగవంతం చేయడంలో మంత్రిత్వ శాఖ మద్దతు పూర్తి సహాయ సహకారాలను అందించాలని కోరారు. స్టార్టప్‌ల కోసం మెరుగైన ఇంక్యుబేషన్ సేవలను అందించడానికి మౌలిక సదుపాయాలతో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం సెంటర్ కార్యకలాపాల విస్తరణ చేయాలన్నారు. ఆర్ఐఎన్ఎల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ముందస్తు అమలును పరిశీలించాలన్నారు. విశాఖలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ కేంద్రం, ఫ్యాబ్రికేషన్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయాలన్నారు. విశాఖ కోసం ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ త్వరగా స్థాపించాలని, బీపీఓ ప్రోత్సాహక పథకం ఆమలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.













