పల్నాడులో ఫ్యాన్ కు ఎదురుదెబ్బ..
వైసీపీకి కంచుకోటలాంటి పల్నాడులో పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పల్నాడులో కీలకంగా ఉన్న లావు పార్టీని వీడటం వైసీపీ శ్రేణుల్ని కలవరానికి గురి చేసింది. ఈ ప్రభావం పల్నాడులోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై పడుతుందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికల సమయంలో పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయడం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది.
నరసరావుపేట పార్లమెంటు సభ్యుడిగా లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. పల్నాడులో కీలకమైన వరికపూడిశెల ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. ఎంపీ నిధులతోపాటు కార్పొరేటు సంస్థల నుంచి సీఎస్ఆర్ విభాగం కింద నిధులు తీసుకొచ్చి 88 గ్రామాల్లో నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటుచేశారు. చిలకలూరిపేటలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణం పనులు పూర్తయ్యేలా చూడటంతోపాటు రొంపిచర్ల, తాళ్ళపల్లిలో రెండు కొత్త కేంద్రీయ విద్యాలయాల్ని ఏర్పాటు చేయించారు. కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిన వైద్య కళాశాలల్లో ఒకటి పిడుగురాళ్లలో ఏర్పాటయ్యేలా కృషి చేశారు.
కార్మికులు ఎక్కువగా ఉండే పల్నాడులో 100 పడకలతో ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు చేయించారు. తక్కువ నీరు, రసాయనాలతో అధిక దిగుబడులు పొందే ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించే ప్రాజెక్టును నకరికల్లు మండలానికి తీసుకువచ్చారు. నాలుగు జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించారు. దీనివల్ల జిల్లాలో చాలా ప్రాంతాలు జాతీయ రహదారులతో అనుసంధానమయ్యాయి. ఇలా పల్నాడుతో ప్రత్యేకమైన అనుబంధాన్ని పెంచుకున్న ఆయన అక్కడి నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఈనేపథ్యంలో అక్కడ బీసీ అభ్యర్థికి సీటు కేటాయించాలని నిర్ణయించడంతో ఆయన ఆ పార్టీకి వీడ్కోలు పలికారు.
లావు పయనమెటు..?
లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయం ఆసక్తిగా మారింది. 2019 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన ఆయన ఈసారి అక్కడే సీటు ఆశించారు. అధిష్ఠానం అక్కడ సీటు ఇవ్వకుండా గుంటూరు వెళ్లాలని సూచించడంతో ఆయన ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈక్రమంలో ఆయన త్వరలోనే టీడీపీలో చేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నరసరావుపేట పార్లమెంటులో నాలుగున్నరేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి పనులు కొనసాగించడంతోపాటు అక్కడ విస్తృత పరిచయాల దృష్ట్యా అక్కడి నుంచే పోటీ చేయాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం.
పార్లమెంటు నియోజకవర్గంలో వ్యక్తిగతంగా పరిచయాలు ఉండటంతోపాటు అభివృద్ధిలోనూ తనదైన ముద్ర వేసినందున కలిసొస్తుందన్న యోచనలో ఆయన ఉన్నారు. లావుతో పాటు వైసీపీలోని ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీ వీడటానికి సిద్ధమయ్యారు. గురజాల పట్టణంలోని కౌన్సిలర్ మహంకాళి అనిత రాజీనామా చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోనూ జడ్పీటీసీ సభ్యుడితోపాటు కొందరు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు లావు వెంట నడిచేందుకు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశారు.













