కేశినేని నాని క్లారిటీ ఇచ్చేశారు..! రంగంలోకి దిగిన టీడీపీ నేతలు..!!
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని టీడీపీతో తెగదెంపులు చేసుకుని వైసీపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీసులో వైసీపీ అధినేత జగన్ తో కేశినేని నాని సమావేశమయ్యారు. పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరిచారు. జగన్ కూడా వైసీపీలో చేరాలని కోరారు. దీంతో త్వరలోనే ఆయన అధికారికంగా వైసీపీలో చేరబోతున్నారు. అయితే కేశినేని నాని వైసీపీలో చేరికపై టీడీపీ ఘాటుగా స్పందించింది. నాని ఇప్పుడు ముసుగు తొలగించారని వెల్లడించింది.
కేశినేని నాని వైసీపీ అధినేత జగన్ తో సమావేశమై పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. జగన్ కూడా నానిని సాదరంగా ఆహ్వానించి కలిసి పని చేద్దామని సూచించారు. ప్రస్తుతానికి సీట్ల కేటాయింపుపై వారి మధ్య చర్చకు రాలేదని సమాచారం. అయితే వైసీపీ నేతలు చెప్తున్నదాన్ని బట్టి విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి కేశినేని నానినే బరిలోకి దింపేందుకు జగన్ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నాని తన కుమార్తెకు, అనుచరులకు సీట్ల కేటాయింపుపై చర్చించలేదని సమాచారం. జగన్ ను కలిసి బయటకు వచ్చిన అనంతరం కేశినేని నాని టీడీపీపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు పచ్చి మోసగాడని విమర్శించారు. తన తప్పు లేకపోయినా తనను తిట్టించేందుకు, కొట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. లోకేశ్ ను ఆఫ్ట్రాల్ అని సంబోధించారు. లోకేశ్ దగ్గరకు తానెందుకు వెళ్లాలని ప్రశ్నించారు. అతనికి ఏమి అర్హత ఉందని అడిగారు. నన్ను గొట్టంగాడు అన్నా పార్టీ పట్టించుకోలేదన్నారు.
కేశినేని నాని విమర్శలపై టీడీపీ కూడా గట్టిగానే రిప్లై ఇచ్చింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.. కేశినేని నానిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. టీడీపీలో ఉన్న వైసీపీ కోవర్ట్ కేశినేని అని అన్నారు. ఇన్నాళ్లకైనా ముసుగు తొలగించినందుకు సంతోషం అన్నారు. ఇదిగో నీ చిట్టా.. ఇప్పుడే మొదలైంది సినిమా.. మున్ముందు చూపిస్తా.. అని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో నాని గెలిస్తే బుద్ధ భవన్ ను ఇచ్చేస్తానని.. ఒకవేళ ఓడిపోతే కేశినేని భవన్ ను ఇస్తావా అని ప్రశ్నించారు. చంద్రబాబును చూసే ఇన్నాళ్లూ ఓపికతో వ్యవహరించామని.. ఇకపై రోజూ ఆటాడుకుందాం.. అని సవాల్ విసిరారు.
మొత్తానికి ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కేశినేని నానిపై ఓ వర్గం ఎప్పటి నుంచో గుర్రుగా ఉంది. నాని కూడా ఎవర్నీ పట్టించుకోకుండా తలబిరుసుతో వ్యవహరిస్తారే ఆరోపణలున్నాయి. ఇప్పుడు నాని తన దారి తాను చూసుకోవడంతో ఆయన వ్యతిరేక వర్గానికి ఫ్రీడమ్ లభించినట్లయింది. అందుకే ఇకపై నాని అంతు చూస్తామంటున్నారు బుద్ధా వెంకన్న. రాజకీయ కేంద్రంగా విజయవాడ ఎప్పుడూ చర్చల్లోనే ఉంటుంది. ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.













