చంద్రబాబును కలిసిన మోహన్ బాబు .. ఏపీ రాజకీయాల్లో
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో మోహన్ బాబు దాదాపు 2 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మోహన్ బాబుతో చంద్రబాబు భేటీ కావడం అటు సినీ వర్గాల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినీ నటుడిగా కొనసాగుతూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మోహన్ బాబు తెలుగుదేశం పార్టీతోనే తన రాజకీయ ప్రస్తావాన్ని మొదలు పెట్టారు.
టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగానూ కొనసాగారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల నుంచి దూరంగా జరిగిన మోహన్ బాబు చంద్రబాబుకు దాదాపు వైరివర్గంగా మారిపోయారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన మోహన్ బాబు ఎన్నికల్లో పార్టీ నుంచి ఎలాంటి అవకాశం దక్కకున్నా పార్టీలోనే కొనసాగారు. ఈ క్రమంలోనే వైసీపీతో దూరం పెంచుకున్న మోహన్ బాబు వైసీపీకి రాజీనామా చేస్తున్నానని, ఇకపై రాజకీయాల జోలికి వెళ్లనంటూ ప్రకటించి సంచలనం రేపారు. తాజాగా చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ కావడం రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.













