విజయసాయిరెడ్డి స్థానంలో మోదుగుల
ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డి నియామకాన్ని రద్దు చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే ఆయన ప్లేస్‌లోకి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని నియమిస్తున్నట్లు తెలిపింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి పార్లమెంటరీ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డిని ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. అయితే తాజాగా ఆయన నియామక ఉత్తర్వులు రద్దు చేస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. విజయసాయిరెడ్డి నియామకానికి సాంకేతిక కారణాలు అడ్డుగా ఉన్న కారణంగానే జీవో రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇక విజయసాయిరెడ్డి స్థానంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి గతంలో ఎంపీగా పనిచేశారు. అటు ఢిల్లీ వ్యవహారాల్లో ఇటు రాష్ట్ర పరిపాలన మీద అవగాహన ఉంది.













