ప్రధాని మోదీ భీమవరం పర్యటనలో.. అరుదైన సన్నివేశం
ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటనలో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులైన పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి, కుటుంబ సభ్యులను మోదీ కలిశారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. ఆ వీర దంపతుల కుమార్తె పసల కృష్ణభారతికి పాదాభివందనం చేశారు. 90 ఏళ్ల వయసు కలిగిన కృష్ణభారతి వీల్ చైర్లో ఉండగా ప్రధాని ఆమె పాదాలను తాకి, నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతులు జాతిపిత గాంధీని అభిమానించిన అనుసరించటమే గాదు. ఏకంగా ఆవాహన చేసుకొని మనసా వాచా ఆచరించిన చూపిన అరుదైన స్వాతంత్య్ర సమర యోధులుగా ప్రఖ్యాతిగాంచారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకాలోని పశ్చిమ విప్పర్రు గ్రామంలో 1900లో జన్మించిన పసల కృష్ణమూర్తి 1921లో తన సతీమణితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధేయవాది అయిన ఆయన ఉప్పు సత్యగ్రహ ఉద్యమంలో పాల్గొని ఒక ఏడాది జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆయన 1978లో కన్నుమూశారు. ఈ మేరకు మోదీ ఏపీలో పర్యటించడమే కాకుడా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొని భీమవరం ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.













