నాలుగేళ్ల క్రితం షా ఎక్కడ?:ముఖ్యమంత్రి చంద్రబాబు
‘ప్రజలే బీజేపీకి డోర్లు మూసే పరిస్థితి వస్తుంది. ఎన్డీఏలో చేరతామని షాను అడుక్కునే వాళ్లు ఇక్కడెవరూ లేరు. 2014లో ఎవరు ఎవరిని అడుక్కున్నారో ఆయన గుర్తు చేసుకోవాలి. చెప్పిన మాట నిలబెట్టుకోకుండా బీజేపీ నమ్మక ద్రోహం చేసింది. నాలుగేళ్ల క్రితం ఆయనెక్కడున్నారు? ఆయన చరిత్ర ఏంటి..? ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. సరైన సమయంలో చెబుతా. గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం నేర్చుకోవాలి. ఇష్టానుసారంగా మాట్లాడితే వినడానికి తెలుగు జాతి సిద్ధంగా లేదు. బీజేపీ రాష్ట్రానికి ఏంచేసిందో ప్రజలు నిలదీస్తున్నారు. దానికి సమాధానం చెప్పకుండా అది చేశాం.. ఇది చేశామని దాడి చేస్తే ఎవరూ భయపడరు. అవినీతి పార్టీ గెలిచి తమను కాపాడుతుందని షా అనుకుంటున్నారు. ఆ అవినీతి పార్టీతోనే ఉండండి. మాకేమీ బాధ లేదు. తితలీ తుఫానుకు శ్రీకాకుళం విధ్వంసమైతే అమిత్షా పరామర్శకు కూడా రాలేదు.
4 నెలల తర్వాత వచ్చి ఏం చూద్దామని, ఏం చేద్దామని? ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడొస్తున్నారు. ప్రజల నిరసనల తీవ్రతను మోదీ, షా ఎదుర్కోక తప్పదు ’’ఎప్పుడూ లేని అభివృద్ధి ‘చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. పెంచిన పింఛన్ల పంపిణీతో పండుగ వాతావరణం నెలకొంది. పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీపై సంతృప్తిగా ఉంది. బీజేపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.1.15 లక్షల కోట్లు ఇచ్చిఉంటే ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే వాళ్లం. జయప్రకాశ్ నారాయణ, పవణ్ కమిటీలే ఈ లెక్కను నిర్ధారించాయ’’ని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.













