Vangaveeti Radha: రాధకు పదవి ఏంటీ..? ఎమ్మెల్సీ అయినా..?
తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత ఉన్న కుటుంబం నుంచి వచ్చినా సరే పదవులను చేపట్టే విషయంలో మాత్రం ఓ నేత వెనకబడే ఉంటారు. ఆయనే వంగవీటి రాధ(Vanagaveeti Radha). తండ్రి వంగవీటి రంగా వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం ఆయన చేసినా.. కొన్ని పరిస్థితులు మాత్రం ఆయనను వెనక్కి లాగుతూనే ఉన్నాయి. ఏ పార్టీలోకి వెళ్లినా ఆయనకు ప్రాధాన్యత లభించినట్లు కనపడుతున్నా.. పెద్దగా గుర్తింపు మాత్రం రావట్లేదు. 2004లో మాత్రమే ఎమ్మెల్యేగా విజయం సాధించిన వంగవీటి రాధా ఆ తర్వాత శాసనసభకు వెళ్లలేదు.
ఈ క్రమంలోనే పలుమార్లు పార్టీలు మారిన వంగవీటి రాధా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రజారాజ్యంతో పాటుగా వైసీపీలో కూడా వెళ్లారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ ను విభేదించిన వంగవీటి రాధ.. ఆ తర్వాత టీడీపీ(TDP)లో ఎమ్మెల్యే సీటు తెచ్చుకుంటారని చాలామంది ఎదురు చూశారు. అయితే అనుకోని పరిస్థితులతో ఆయనకు ఎమ్మెల్యే సీటు చంద్రబాబునాయుడు కేటాయించలేదు. 2024 లో ఆయనకు నరసరావుపేట సీటు లేదంటే గోదావరి జిల్లాలో ఓ స్థానం కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది.
అయినా సరే వంగవీటి రాధకు ఏ సీటు కేటాయించలేదు. ప్రస్తుతం ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం మొదలైంది. 2024 ఎన్నికల్లో కూటమి విజయం సాధించడానికి వంగవీటి రాధ కూడా తనవంతు ప్రయత్నం చేశారు. దీంతో ఆయనకు ఖచ్చితంగా చంద్రబాబునాయుడు ప్రాధాన్యత ఇస్తారని ఆయన అభిమానులతో పాటుగా కాపు సామాజిక వర్గం కూడా ఎదురుచూస్తోంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో చంద్రబాబు ఆలోచన ఎలా ఉంది అనే దానిపై స్పష్టత రావటం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
వైసీపీ నుంచి రాజీనామా చేసిన వారి స్థానంలో ఆయనను ఎంపిక చేస్తారని చాలామంది ఎదురుచూస్తున్నారు. అయినా సరే ఇప్పటివరకు స్పష్టత రావటం లేదు. ఇటీవల వంగవీటి రాధ పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్ స్వయంగా ఈ విషయంపై హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయినా సరే ఇప్పటివరకు ఈ విషయంలో ముందడుగు పడలేదు. ఇక వంగవీటి రాధకు మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారము జరిగింది. అలాగే టిటిడి పాలక మండల్లో కూడా అవకాశం కల్పిస్తారు అనే వార్తలు వచ్చాయి. అయినా సరే ఇప్పటివరకు వంగవీటి రాధకు ఏ పదవి వరించలేదు. మరి భవిష్యత్తులోనైనా వంగవీటి రాధ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.













