Duvvada Srinivas: దువ్వాడ పై సస్పెన్షన్ వెయిట్ వేసిన వైసీపీ..

వైసీపీ (YSR Congress Party) ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas) పార్టీ నుంచి సస్పెండ్ చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల ప్రకారం అధినేత జగన్ (Jagan Mohan Reddy) ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. అయితే ఇది ఆలస్యంగా తీసుకున్న నిర్ణయమనే అభిప్రాయాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దువ్వాడ పర్సనల్ లైఫ్ కారణంగా ఇప్పటికే పార్టీకి పరువు నష్టమవుతుంటే, అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం దువ్వాడ వ్యవహారంపై సోషల్ మీడియా యాక్టివిస్టులు, పార్టీ కార్యకర్తలు తీవ్ర విమర్శలు చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మౌనంగా ఉండకుండా చాలా రోజుల తర్వాత ఇప్పుడు సస్పెన్షన్ నిర్ణయం తీసుకోవడం వల్ల ఉపయోగమేంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో భార్యతో వివాదం మొదలైన సమయంలోనే స్పందించి ఉంటే, పరిస్థితి ఈ స్థాయికి చేరేది కాదని అంటున్నారు.
దువ్వాడ పర్సనల్ జీవితంలోని వివాదాలను పబ్లిక్ గా చర్చించడం, తన చర్యలను సోషల్ మీడియాలో సమర్థించుకోవడం పార్టీకి తీవ్ర డ్యామేజ్ చేసిందని పేర్కొంటున్నారు. ఆయన వ్యవహారం పట్ల పార్టీ చాలాకాలం మౌనం పాటించడంతో ప్రజల్లో తప్పుబావన పెరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఆయనతోపాటు మరికొందరిపై కూడా వేటు వేయాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav), ఎమ్మెల్సీ అనంతబాబు (Anantha Babu)ల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
పార్టీ నుంచి వచ్చిన అధికార ప్రకటనపై కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ (Jagan) సంతకం లేకపోవడాన్ని కొందరు ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. పబ్లిక్ లో గౌరవ డాక్టరేట్ అంటూ పేరు తెచ్చుకున్న వ్యక్తిని ఇలా బయటకు పంపడం సరికాదని కొందరంటున్నారు. మరికొందరైతే చాలా ఆలస్యంగా అయినా సరైన నిర్ణయమే తీసుకున్నారని అభినందిస్తున్నారు. ఇక ఎన్నికల ముందు ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుని ఉంటే పార్టీకి గౌరవం మిగిలి ఉండేదని భావిస్తున్నవారూ ఉన్నారు. ముఖ్యంగా పార్టీ అధినేత పక్కన కూర్చునే స్థాయిలో ఉన్నవారు అంతర్గతంగా పార్టీకి నష్టం చేస్తుంటే వారిపై చర్యలు తీసుకోవడం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి ఇప్పుడైనా దువ్వాడను సస్పెండ్ చేయడం ద్వారా పార్టీ శుద్ధి దిశగా అడుగులు వేస్తోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.