జగన్…నేటి నాయకుడు: వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా
ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వంతో ప్రజలకు మేలు జరుగుతుందని, అలాంటి ధైర్యం, సత్తా పుష్కలంగా ఉన్న నేటి కాలానికి నప్పే సరైన రాజకీయ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా శనివారం ఏపీ రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ(ఏపీఎంవీపీసీ) ఆధ్వర్యంలో స్థానిక రామన్నపేటలోని ప్రభుత్వ కార్యాలయంలో ఆయనకు అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు ఏపీఎంవీపీసీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమం, అభివృద్ధి ఏకకాలంలో అమలవుతున్నాయని గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ప్రస్తుత పాలనలోనే పారిశ్రామికవృద్ధి గణనీయంగా పెరిగిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు గతంలో ఎన్నడూ లేనంత ప్రోత్సాహమివ్వడంలో సిఎం ముందున్నారన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మద్య విమోచన ప్రచార కమిటీకి తనవంతు సలహా సూచనలిచ్చి సహకరిస్తామని హామినిచ్చారు. కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ దేశచరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా శాసనమండలి పదవిని డొక్కా మాణిక్యవరప్రసాద్ తృణప్రాయంగా త్యాగం చేశారన్నారు. అంతటి త్యాగాన్ని గుర్తించి మరలా అదే పదవిని ఆయనకే కేటాయించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనాదక్షతకు నిదర్శనమన్నారు. బడుగు, బలహీనవర్గాల రాజ్యాధికార సాధన దిశగా ముఖ్యమంత్రి ఆలోచన సాగించడం శుభపరిణామంగా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ సామాజిక స్పృహతో పాటు రాజకీయ నీతిజ్ఞులుగా డొక్కా మరిన్ని పదవులు అలంకరించాలన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా మట్లాడుతూ తాడికొండ కేంద్రంగా వరప్రసాద్ తో తన సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. గుంటూరు వ్యవసాయ మిర్చి మార్కెట్ యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ భవిష్యత్తులో డొక్కాను మరోమారు మంత్రిగా చూడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ను లక్ష్మణరెడ్డి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి పూలబొకే అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.













