వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి… రిటర్న్ గిఫ్ట్
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 13.35 లక్షల మంది ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వానికి రిటర్న్‌గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు ఇచ్చే రిటర్న్గిఫ్ట్ను సకల సలహాదారులు, పోలీసులు అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం వల్ల 10 శాతం మంది ఉద్యోగులకు కూడా లబ్ధి చేకూరలేదన్నారు. సీపీఎస్ రద్దు హామీపై మాట తప్పి మడమ తిప్పిన సీఎం జగన్ పోలీసుల సాయంతో ఉద్యోగులపై నిర్బంధకాండ జరిపారని మండిపడ్డారు. ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లకు టీడీపీ మద్దతుంటుందన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం తరహాలో ఉద్యోగ`ఉపాధ్యాయ సంఘాల పోరాటం జరుగుతోందని, దీని ముందు పోలీసుల శక్తి సరిపోదన్నారు. ఉద్యోగులతో తాత్కాలికంగా సమ్మె విరమింపజేయగలరేమో కానీ వారి సలకల్పాన్ని మార్చలేరని అన్నారు.













