Chandra Babu: కీలక సమావేశానికి ఎమ్మెల్యేల గైర్హాజరు.. చంద్రబాబు అసహనం..

తెలుగుదేశం పార్టీ (TDP) మంచి క్రమశిక్షణకు పేరుగాంచిన పార్టీగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) నాయకత్వంలో పాలనకు సంబంధించి నియమాలు, సమయపాలన వంటి అంశాల్లో టీడీపీ ముందుండేదని అందరికీ తెలుసు. అయితే ఇటీవల అమరావతి (Amaravati)లో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఊహించని విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ సమావేశానికి మొత్తం ఎమ్మెల్యేలు రావాల్సి ఉండగా, అందులో 15 మంది గైర్హాజరు కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా వీరంతా విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తుండటంతో పార్టీ అధినేత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పరంగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ఇలా సమయానికి డ్యూటీని మరిచి టూర్లకు వెళ్లడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. కేవలం ఎమ్మెల్యేలే కాదు, మరికొంత మంది ఆహ్వానిత నాయకులు కూడా సమావేశానికి హాజరుకాలేదు. మొత్తం 31 మంది ఇతర నాయకులు కూడా ఈ సమావేశానికి రాలేదు. చంద్రబాబు మాత్రం ఏం చెప్పినా, ఎవరు ప్రారంభం నుంచి హాజరయ్యారు, ఎవరు మధ్యలో వెళ్లిపోయారు, చివరి వరకు ఉన్న వారు ఎవరన్న లెక్కలు తన వద్ద ఉన్నాయంటూ స్పష్టంగా హెచ్చరించారు.
గైర్హాజరు నేతలలో కొందరు దేవాలయ సందర్శనలు వెళ్ళారని, మరికొందరు విదేశీ పర్యటనల్లో ఉన్నారని తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ, పార్టీకి సంబంధించిన సమావేశం కంటే దైవ దర్శనాలు అవసరమా? అని నిలదీశారు. భవిష్యత్‌లో ఇలా తరచూ విదేశాలకు వెళ్లే వారికి విదేశాల్లోనే ఉండటం మంచిదేమోనని చురక వేస్తూ వ్యాఖ్యానించారు.
ఇక ఈ గైర్హాజరు ఎమ్మెల్యేలలో కొందరు అమెరికాలో జరుగుతున్న తానా (TANA), ఆటా (ATA) సమావేశాలకు వెళ్లినట్లు వార్తలొస్తుండటం, మరింత వివాదానికి తావిస్తోంది. ఇందుకు సంబంధించిన టికెట్ వివరాలు కూడా తన వద్ద ఉన్నాయని చంద్రబాబు ప్రకటించడంతో, పార్టీ అంతర్గత వ్యవస్థపై ఆయన పకడ్బంధ వ్యూహాన్ని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిణామాలు పార్టీ అంతర్గతంగా ఒక కొత్త వ్యవస్థాబద్ధత వైపు దారి తీసే సూచనలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్న విషయం ప్రధాన చర్చనీయాంశంగా మారింది.