Ys Jagan: జగన్ నాలుగో గేటు నుంచే.. బులిటెన్ రిలీజ్ చేసిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) బడ్జెట్ సమావేశాలు ఈసారి హాట్ హాట్ గా నడిచే అవకాశాలు కనపడుతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏయే అంశాలను ఫోకస్ చేయవచ్చు అనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇక సమావేశాలకు వైఎస్ జగన్(YS Jagan) హాజరు కావాలని నిర్ణయం తీసుకోవడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పలు రూల్స్ రిలీజ్ చేసింది. భద్రతా కారణాల రీత్యా పాస్ లు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
అసెంబ్లీ, మండలి లో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్ లతో పాస్ ల జారీ చేసారు. అసెంబ్లీ 1 వ గేట్ నుంచి మండలి చైర్మన్, స్పీకర్ , డిప్యూటీ స్పీకర్ , సీఎం, డిప్యూటీ సీఎంలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ప్రతిపక్ష నేత ఉంటే గేటు 1 నుంచి హాజరు అవుతారు. గేట్ 2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతిస్తూ బులెటిన్ జారీ చేసారు. మండలి చైర్మన్, స్పీకర్, సీఎంలు వచ్చి వెళ్లే కారిడార్ లోకి ఇతరులెవ్వరికీ అనుమతి లేదని స్పష్టం చేసారు.
నాలుగో గేట్ గన్ పాయింట్ మినహా భద్రతా సిబ్బందిని అనుమతించేది లేదని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. మంత్రులు, సభ్యుల పీఏలను అవసరం మేరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేసింది. శాసనసభా వ్యవహారాలతో సంబంధం లేని ప్రభుత్వ విభాగాల సిబ్బందికి ప్రాంగణంలోకి అనుమతి లేదని పేర్కొన్నారు. శాసనసభ, మండలిలోకి సభ్యులు ఎవరూ ఆయుధాలతో రాకూడదని స్పష్టం చేస్తూ బులెటిన్ లో పలు సూచనలు చేసారు. ఒక వేళ వచ్చినా అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న బెల్ ఆఫ్ ఆర్మ్ లో డిపాజిట్ చేయాల్సిందిగా సూచించారు.
ఆయుధాలు, లాఠీలు, ప్లకార్డులు, విజిల్స్ లాంటి వాటితో విధానపరిషత్ ప్రాంగణంలోకి ప్రవేశం లేదని వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా సభ్యుల పీఏలు, వ్యక్తిగత సిబ్బందిని తీసుకురావొద్దని స్పష్టం చేసింది ప్రభుత్వం. అసెంబ్లీలోని మీడియా పాయింట్ మినహా ఇతర చోట్ల మీడియా సమావేశాలు నిర్వహించొద్దని సభ్యులకు, మంత్రులకు సూచనలు జారీ చేసారు. ఇక జగన్ సమావేశాలకు హాజరు అవుతున్న నేపధ్యంలో ప్రభుత్వం కూడా ఆయన్ను ఎదుర్కొనే ప్రణాలికలు సిద్దం చేస్తోంది.













