Ramanaidu Studios: రామానాయుడు స్టూడియో భూమిపై వివాదం ..ప్రభుత్వ నిర్ణయం ఏమిటో?
రామానాయుడు స్టూడియో (Ramanaidu studio) భూమి వివాదం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నం(Visakhapatnam ) నుంచి భీమిలీ (Bhimili) వైపుగా ఉన్న ఈ స్టూడియోకు ప్రభుత్వం గతంలో దాదాపుగా 35 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే అందులో 15 ఎకరాల భూమి స్టూడియో అభివృద్ధికి కాకుండా వేరే పనుల కోసం వినియోగించారని, అందుకే ఆ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అసెంబ్లీలో మాట్లాడారు.
అంతేకాదు, ఈ భూమిని లే అవుట్లు వేసి అమ్మే ప్రయత్నాలు కూడా గత ప్రభుత్వంలో జరిగాయని, అయితే తాను కోర్టుకు వెళ్లి ఆ పనిని అడ్డుకున్నానని ఆయన పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ 15 ఎకరాల భూమి స్టూడియో అవసరాలకు ఉపయోగపడలేదని, దానికి అసలు ఉపయోగం లేకపోతే తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది చర్చనీయాంశంగా మారటానికి కారణం, 2000 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ భూమిని రామానాయుడు స్టూడియో కోసం కేటాయించడం. దాదాపుగా 20 ఎకరాల వరకు స్టూడియో నిర్మాణానికి ఉపయోగించగా, మిగిలిన 15.17 ఎకరాల భూమిపై వివాదాలు కొనసాగుతున్నాయి. వైసీపీ (YCP) హయాంలో లే అవుట్లకు అనుమతులు తీసుకునే ప్రయత్నాలు జరిగినట్టు ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో టీడీపీ (TDP) నేతలు దీనిపై తీవ్ర విమర్శలు చేయడంతో ఆ యత్నం ఆగిపోయింది.
ప్రస్తుతం మళ్లీ ఈ భూమిపై చర్చ మొదలైంది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా, లేదా స్టూడియో యాక్టివిటీలను ప్రోత్సహించాలని నిర్ణయిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వం భూమి కేటాయించిన తర్వాత తిరిగి స్వాధీనం చేసుకున్న సందర్భాలు చాలా అరుదు. ఇక సినీ పరిశ్రమను విశాఖలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటే, ఈ భూమిని ఎలా వినియోగించాలన్న దానిపై స్పష్టత అవసరం. ప్రస్తుతం ఏపీలో ఉన్న ఏకైక ప్రముఖ స్టూడియో రామానాయుడు స్టూడియోనే. దీనికి సంబంధించి తరచుగా వివాదాలు వస్తుండటంతో, భవిష్యత్తులో సినీ పరిశ్రమ విశాఖకు వస్తుందా లేదా అన్నదీ సందేహంగా మారింది. ప్రభుత్వం పరిశ్రమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందా లేక భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.













