కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల పాపం చంద్రబాబుదే: ఎమ్మెల్యే తోపుదుర్తి
కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టుల పాపం చంద్రబాబుదేనని, ఆయన హయాంలోనే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులకు పునాది పడిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పాలనలోనే సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురుయ్యాయని, కర్ణాటక అక్రమ ప్రాజెక్టులకు చంద్రబాబు ఏనాడూ అభ్యంతరం చెప్పలేదని ధ్వజమెత్తారు. అప్పట్లో కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచినా చంద్రబాబు నోరు మెదపలేదని, ఆ తర్వాత 2017లో రెండో విడత అప్పర్భద్ర ప్రాజెక్టుకు అనుమతులు వచ్చినా బాబు ప్రభుత్వం పట్టించుకోలేదని, దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నామని తోపుదుర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమస్యపై న్యాయపోరాటం చేస్తూనే ఉందని గుర్తు చేశారు.
ఇదిలా ఉంటే ఎగువ భద్ర ప్రాజెక్టు వల్ల తెలుగు రాష్ట్రాలు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కోవలసి ఉంటుందనేది నిపుణుల వాదన. దీనికి తోడు తుంగభద్ర జలాశయం ఎగువన నిర్మించిన ఈ భద్ర ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం తెలుగు రాష్ట్రాలకు ప్రత్యక్షంగా, తమిళనాడుకు పరోక్షంగా నీటి ఇబ్బందులు తెచ్చిపెట్టబోతోంది. 2 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యంగా నిర్మిస్తున్న ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను సైతం కేంద్రం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు వ్యతిరేకంగా కర్ణాటక పెద్ద ఎత్తున జలాలను కొల్లగొడుతున్నా.. వాటిని పట్టించుకోకపోగా ఇప్పుడు కేంద్రమే ఏకంగా ఈ ప్రాజెక్టును నిర్మించడం తెలుగు రాష్ట్రాలు నిజంగా ఆందోళన చెందాల్సిన విషయమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.













