Corrupted MLAs : మనల్నెవడ్రా ఆపేది.. అంటున్న ఎమ్మెల్యే..! ఢిల్లీ వరకూ చేరిన వ్యవహారం..!!
ఆంధ్రప్రదేశ్ లో కూటమికి (NDA Alliance) కనీవినీ ఎరుగని మెజారిటీ లభించింది. వైసీపీ (YSRCP) కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ఇక తమకు అడ్డూఅదుపూ లేదనే నిర్ణయానికి వచ్చేశారు ప్రజాప్రతినిధులు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా కాకముందే అవినీత మరకలు అంటించుకుంటున్నారు. ప్రజాప్రతినిధులపైన కూటమి వ్యతిరేక పత్రికల్లోనో, మీడియాలోనో వార్తలు వస్తే కక్షతో ఆ పని చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ కూటమి అనుకూల మీడియాలోనే ఎమ్మెల్యేల అవినీతిపై పుంఖానుపుంఖానులుగా కథనాలు వస్తున్నాయి. తాజాగా ఓ ఎమ్మెల్యే అవినీతి (MLA Corruption) వ్యవహారం కేంద్ర హోంశాఖ వరకూ చేరిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కూటమి ఎమ్మెల్యేలు బరి తెగించేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు (TDP MLAs) అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అందినకాడికి దోచుకోవాలనే యావతో పని చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికల్లో పెట్టిన కోట్ల రూపాయలను ఒక్క ఏడాదిలోనే సంపాదించుకోవాలనే తపన కొందరు ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. అందుకే చిరు వ్యాపారి మొదలు బడా పారిశ్రామక వేత్తల వరకూ ఎవర్నీ వదలట్లేదు. నయానో భయానో వాళ్లను దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ మాట వినకపోతే పోలీసు అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా వాళ్ల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి బలిపశువులవుతున్నారు.
కొన్ని నెలల కిందట శ్రీకాళహస్తిలో (Srikalahasthi) ఓ తుక్కు వ్యాపారిని (Scrap industry) నెలనెలా తనకు మామూళ్లు ఇవ్వాలని స్థానిక ప్రజాప్రతినిధి బెదిరించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. వెంటనే ఆ వార్త రాసిన విలేఖరిని పలిపించి ఇకపై తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఖబడ్దార్ అని హెచ్చరించినట్లు కూడా తెలిసింది. అయితే తాజాగా ఇదే అంశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తుక్కు వ్యాపారి ఢిల్లీకి సమాచారాన్ని చేరవేయడంతో హోంశాఖ (Home Ministry) అధికారులు కూటమి పెద్దలకు విషయం చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వ్యవహారంలో భాగస్వాములైన పోలీసులను డీఐజీ అనంతపురం (Anantapuramu DIG) పిలిపించి ఆరా తీసినట్లు తెలిసింది.
ఇటీవలే శ్రీకాళహస్తి ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే బహిరంగంగా కామెంట్స్ చేశారు. నీ కంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి (Biyyapu Madhusudhan Reddy) వంద రెట్లు మేలు అని టీడీపీ నేతే వ్యాఖ్యానించారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారం మాత్రమే. ఇలాంటి ఎమ్మెల్యేలు దాదాపు 40 మంది ఉన్నట్టు సమాచారం. అందులోనూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే ఇలా బరితెగిస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు పదేపదే చెప్తున్నా ఇలాంటి ఎమ్మెల్యేలు పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారు. వీళ్లను గాడిలో పెట్టకపోతో రాష్ట్రం పరువు బజారున పడుతుందనే భయం టీడీపీ అభిమానుల్లో కనిపిస్తోంది. మరి హైకమాండ్ ఏం చేస్తుందో వేచి చూడాలి.













