Nandamuri Balakrishna: అసెంబ్లీలో బాలకృష్ణ ఫైర్..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో (AP Assembly) హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యాఖ్యలు కలకలం రేపాయి. వైసీపీ, అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan)ను ఆయన సైకో (Psycho) అని సంబోధించారు. అదే సమయంలో సినీ పెద్దలు జగన్ ను కలిసిన సమయంలో జరిగిన పరిణామాలపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) వ్యాఖ్యలను బాలకృష్ణ తప్పుబట్టారు. అంతేకాక ప్రస్తుత ప్రభుత్వం కూడా తనను అగౌరవపరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కందుల దుర్గేశ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు బాలకృష్ణ అన్నారు. సభలో బాలయ్య వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాంతిభద్రతలపై చర్చ జరిగింది. ఈ సమయంలో కొంతమంది సోషల్ మీడియాలో, మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. అలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ తీరుపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. సినిమా పెద్దలు జగన్ ను కలవడానికి వెళ్లినప్పుడు జగన్ మొదట ఇష్టపడలేదని, సినిమాటోగ్రఫీ మంత్రిని కలవాల్సిందిగా సూచించారన్నారు. అయితే చిరంజీవి గట్టిగా అడగడంతో జగన్ దిగి వచ్చి సినిమా పెద్దలను కలిసినట్లు కామినేని వెల్లడించారు.
అయితే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను బాలకృష్ణ ఖండించారు. చిరంజీవి నిలదీయడంతోనే జగన్ దిగివచ్చారనడం అబద్దమన్నారు. ఆ సైకోగాడ్ని ఎవరూ గట్టిగా అడగలేదన్నారు. జగన్ ముందు సినిమా ఇండస్ట్రీ సాగిలపడలేదని చెప్పేందుకు బాలకృష్ణ ప్రయత్నించారు. అయితే అది కామినేనిని ఇబ్బందికరంగా మారింది. తాను జగన్ ను దోషిగా చూపించేందుకు ప్రయత్నించగా, బాలకృష్ణ అలాంటిదేం లేదని ఖండించడం సభలో సభ్యులను ఆశ్చర్యపరిచింది. అంతేకాదు.. ఈ ప్రభుత్వం కూడా తనను అవమానపరిచిందని బాలకృష్ణ అన్నారు. FDC సమావేశానికి తనను ఆహ్వానించారని, అయితే తన పేరును 9వ స్థానంలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ లిస్ట్ ఎవరు తయారు చేశారని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ ను అడిగినట్లు బాలకృష్ణ చెప్పారు. కనీస గౌరవ మర్యాద ఇవ్వడం కూడా తెలీదా అని ప్రశ్నించారు.
బాలకృష్ణ కామెంట్స్ ఇవాళ అసెంబ్లీలో కలకలం రేపాయి. ఆయన ఏం చెప్పబోయి ఏం చెప్పారోనని సభ్యులు చర్చించుకున్నారు. జగన్ ను సైకో అన్నప్పుడు మాత్రం సభ్యులంతా నవ్వుకున్నారు. అలా బాలకృష్ణ ఇవాళ ఓ వైపు నవ్వులు పూయించారు. మరోవైపు తన ఆగ్రహంతో అటు కామినేనిని, ఇటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశారు.