South Korea:ఏపీలో పెట్టుబడులు పెట్టండి ..దక్షిణ కొరియా కంపెనీలకు మంత్రులు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల వాతావరణాన్ని కూటమి ప్రభుత్వం కల్పించిందని, అన్ని రకాల అనుమతులూ ఒకేసారి అందించడంతోపాటు వంద రోజుల్లో పనులు ప్రారంభించేలా ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నామని మంత్రులు నారాయణ(Narayana) , జనార్దన్‌రెడ్డి దక్షిణ కొరియా (South Korea) పెట్టుబడిదారులను ఉద్దేశించి అన్నారు. ఆ దేశంలో మూడు రోజులుగా పర్యటిస్తున్న మంత్రులు అధికారుల బృందం సియెల్‌లోని కియా కార్ల (Kia car) పరిశ్రమ కరపధాన కార్యాలయాన్ని సందర్శించింది. కియా సంస్థ స్ట్రాటజిక్ బిజినెస్ ప్లానింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్లోబల్ ఆపరేషన్స్ డివిజన్ ప్రతినిధులతో మంత్రులు సమావేశమయ్యారు. పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్‌లో మంచి అవకాశాలున్నాయని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు. 15 నెలల వ్యవధిలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని మంత్రులు వివరించారు. అనంతపురంలో కియా యూనిట్ నుంచి కార్ల ఉత్పత్తి, ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై చర్చించారు. గ్లోబల్ మార్కెట్‌లో కియా కార్ల అమ్మకాలు, యూనిట్ల విస్తరణపైనా ఆ కంపెనీ ప్రతినిధులతో మంత్రులు మాట్లాడారు.
సియోల్‌లో లాటే సంస్థ ప్రతినిధులతోనూ మంత్రులు భేటీ అయ్యారు. లాటే కార్పొరేషన్ డెవలప్‌మెంట్ టీం హెడ్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్‌లతోపాటు ఇతర ప్రతినిధులతో మంత్రులు సమావేశమయ్యారు. ఫుడ్, కెమికల్స్, ఫార్మా రంగాలలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టిన ఈ గ్రూపును ఏపీకి ఆహ్వానించారు. సింగిల్ విండో విధానంలో అనుమతులు, ప్రభుత్వం నుంచి అందించే ప్రోత్సాహకాలు తదితర అంశాలను మంత్రులు నారాయణ, జనార్దన్‌రెడ్డి (Janardhan Reddy) వివరించారు. సియోల్ పర్యటనలో మంత్రులతో పాటు దక్షిణ కొరియాలోని భారత రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ నిషికాంత్‌సింగ్‌తోపాటు అధికారులు ఎంటీ కృష్ణబాబు, పీయూష్ గోయల్ పాల్గొన్నారు.