అది ట్యాపింగ్ కాదు.. రికార్డింగే..: కోటంరెడ్డికి మంత్రుల కౌంటర్
తన ఫోన్ను సొంత పార్టీనే ట్యాపింగ్ చేస్తోందని, అందుకే పార్టీని వదిలిపెట్టబోతున్నానని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి ప్రకటన చేసిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు ఎదురుదాడి మొదలుపెట్టారు. తాడేపల్లిలోని సీఎం జగన్ను క్యాంప్ కార్యాలయంలో కలిసిన వీళ్లంతా కోటం రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ నేత, మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నాని మాట్లాడుతూ.. ఫోన్లు ట్యాప్ చేయడానికి పెగాసెస్ లాంటి సాఫ్ట్వేర్లు కొనే చరిత్ర చంద్రబాబుదని, ఆ అలవాటు సీఎం జగన్మోహన్రెడ్డికి లేదని అన్నారు. చంద్రబాబు మంత్రి పదవిని ఆఫర్ చేసి ఉంటారని, అందుకే కోటం రెడ్డి టీడీపీలో చేరతానని ప్రకటన చేసిఉ ఉండొచ్చని కొడాలి అనుమానం వ్యక్తం చేశారు. గతంలో 23 మంది పకోడిగాళ్లు టీడీపీలోకి వెళ్లారని.. వారిలో ఒకరే గెలిచారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఇలాంటి పకోడీ గాళ్లంతా వెళ్లిపోతేనే పార్టీ బాగుపడుతుందన్నారు. చంద్రబాబులా ఒకే కులానికి పదవులు అంటే కుదరదన్నారు.
ఇక మాజీ మంత్రి పేర్ని నాని కూడా కోటం రెడ్డి ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రతి మనిషి ఫోన్లో రికార్డింగ్ యాప్ ఉంటుందని, ప్రతి కాల్ రికార్డ్ చేసి సర్క్యులేట్ చెయ్యచ్చుని అన్నారు. అది కాల్ రికార్డింగే కానీ, ట్యాపింగ్ ఏ మాత్రం కాదని స్పష్టం చేశారు. ‘సీఎంపై ఎబ్బెట్టుగా మాట్లాడడం వల్లే ఆ కాల్ రికార్డ్ పంపించారు. నేను కూడా ఎవరితో అయినా సీఎం గురించి, సొంత నాయకుడి గురించి అలా మాట్లాడితే ఇదే తరహాలో కాల్ రికార్డింగ్ పంపిస్తారు. అదే కోటం రెడ్డి వ్యవహారంలో జరిగింది’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కాల్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎవరికుటుందని, కేవలం సీఎం జగన్పై, పార్టీపై బురద చల్లడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.













