మంత్రి పదవి కన్నా తనకు.. ప్రజాసేవే ముఖ్యం
మంత్రి పదవి ఉన్నా లేకపోయినా బాధపడనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో మంత్రి అప్పలరాజు భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి పదవి కన్నా తనకు ప్రజాసేవే ముఖ్యమని స్పష్టం చేశారు. నా దృష్టిలో వైసీపీ ఎమ్మెల్యేలందరూ మంత్రులే. బీసీల నుంచి వచ్చిన నాకు జగన్ మంత్రి పదవి కట్టబెట్టారు. మంత్రి పదవి నుంచి తొలగిస్తారన్న సమాచారం లేదు అని అన్నారు. కేబినెట్లో మార్పులు జరగబోతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. నలుగురు మంత్రులను తప్పించి కొత్తవారికి కేబినెట్లో అవకాశం ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మంత్రి అప్పలరాజు సీఎం జగన్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.













