ప్రవాసాంధ్రులు ముందుకు రావాలి : మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమ శాఖ మంత్రి రోజా కోరారు. ఆస్ట్రేలియాలో రోజా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మెల్బోర్న్లో వైఎస్ఆర్సీసీ కో ఆర్డినేటర్ చింతలచెరువు సూర్యానారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో కలిసి ప్రవాసాంధ్రుల సమావేశంలో మాట్లాడారు. పేదల సంక్షేమానికి సమ సమాజాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యుద్దం చేస్తున్నారని అన్నారు. టీడీపీ కుట్రలు, దుష్టచతుష్టయం కుతంత్రాలను సీఎం జగన్ ఎదిరిస్తూ దేశం మెచ్చే పాలన అందిస్తున్నారన్నారు.
సెప్టెంబర్ ఒకటో తేదీన బ్రిస్బేన్లో జరిగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొంటారు. అనంతరం 3న ఆసిస్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలకు ఆమె హాజరవుతారు. తర్వాత ప్రవాస భారతీయులు, ఆస్ట్రేలియా పెట్టుబడిదారులతో ఏపీ టూరిజంలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.













