లోకేష్ పెద్ద ఐరన్ లెగ్.. అడుగుపెడితే ప్రాణాలు గాల్లోనే..: మంత్రి రోజా
నారా లోకేష్ అడుగు పెట్టాడంటే ఎవరో ఒకరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా.. లోకేష్ పెద్ద ఐరన్ లెగ్ అని, ఎక్కడ అడుగుపెడితే అక్కడ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయన్నారు. అలాగే తారకరత్న అస్వస్థతకు గురైతే చంద్రబాబు, లోకేష్ పట్టించుకోలేదని విమర్శించారు. అంతేకాకుండా ‘లోకేష్ అడుగుపెట్టాడు.. రాజమండ్రి పుష్కరాల్లో జనం చనిపోయారు. లోకేష్ పాదయాత్ర పోస్టర్ రిలీజ్ చేస్తే మరకొందరు చనిపోయారు. లోకేష్ పాదయాత్ర చేపట్టాడు.. తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. లోకేష్ తొలిరోజే తడబడ్డాడు. అతను లోకేష్ కాదు. పులకేష్’ అంటూ రోజా నిప్పులు చెరిగారు.
మహిళలను కించపరిచే తండ్రి, కొడుకులకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదన్న రోజా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు భద్రత పెరిగిందని, ఆయన పరిపాలనపై మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే అధికారంలో ఉన్నప్పుడు తండ్రి చంద్రబాబు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి తీసుకుని లోకేష్ ఏం చేశారని ప్రశ్నించారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాన్నట్లు, ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరారు.













