ఆస్ట్రేలియాలో చవితి వేడుకల్లో మంత్రి రోజా సందడి
ఆస్ట్రేలియాలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో మంత్రి రోజా దంపతులు సందడి చేశారు. ఈ వేడుకల్లో రోజా ప్రధానాకర్షణగా నిలిచారు. బ్రిస్బెన్లో ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్, బ్రిస్సేన్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా చవితి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ దేశం విడిచి దశాబ్దాలు దాటినా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ఆస్ట్రేలియాలో పాటించడం హర్షదాయకమన్నారు. తెలుగు భాష సంస్కృతీ, సంప్రదాయాలు, పండుగలపై గౌరవం పెరిగేలా ఆస్ట్రేలియాలో ప్రవాసాంధ్రులు చవితి వేడుకలు నిర్వహించడం ముదావహమన్నారు. ఇక్కడి చవితి వేడుకలు ఏపీని మరిపిస్తున్నాయన్నారు. ఈ సంరసద్భంగా మంత్రి రోజా సెల్వంమణి దంపతులకు తెలుగు అసోసియేషన్ సభ్యులు సాదర స్వాగతం పలికారు. చవితి వేడుకలను పురస్కరించుకుని ప్రవాసాంధ్రుల చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి రోజా దంపతులిద్దరినీ ఘనంగా సత్కరించారు.













