Kandula Durgesh: సినీ పరిశ్రమ అభివృద్ధికి త్వరలో కొత్త పాలసీ: మంత్రి దుర్గేశ్
విశాఖపట్నం, తిరుపతిలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) తెలిపారు. సినీ పరిశ్రమ అభివద్ధికి త్వరలో కొత్త పాలసీ తీసుకురాబోతున్నట్లు చెప్పారు. సినీ ప్రముఖులతో చర్చించి కార్యచరణ రూపొందిస్తామన్నారు. విశాఖపట్నం (Visakhapatnam) లో సినీ పరిశ్రమ అభివృద్ధి, గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధిపై మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. విశాఖలో చలన చిత్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్న మంత్రి, కూటమి ప్రభుత్వం రాగానే సీఎం చంద్రబాబు (Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినీ పరిశ్రమకు చెందిన పెద్దలతో చర్చించారని, హైదరాబాద్ తరహాలో స్టూడియోలను రాష్ట్రంలో ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయని, స్టూడియోలు నిర్మిస్తే ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని నిర్మాతలకు చెప్పినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ద్వారా లేక పీపీపీ మోడ్లో స్టూడియోల నిర్మాణానికి సహకారం అందిస్తామన్నారు.













