మంత్రివర్గ సమవేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పేర్ని నాని
వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో నూతన పాలసీకి ఆమోదం
341 శాశ్వత కొనుగోలు కేంద్రాలు. 365 రోజులు నిర్వహణ
మరో నాలుగు పంటలకు కనీస మద్దతు ధర ప్రకటన
108, 104 సర్వీసులకు పూర్వ వైభవం. కొత్తగా వాహనాలు
108 సర్వీసులు 412 కొనుగోలు. 104 సర్వీసులు 656 కొనుగోలు
వచ్చే ఏడాది మార్చి 31 లోగా అందుబాటులోకి సర్వీసులు
సమాచార పౌర సంబంధాల మంత్రి పేర్ని నాని వెల్లడి
కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి
మంత్రివర్గ సమావేశంలో ఇతర నిర్ణయాలపై మంత్రి మాటల్లో:
పంచాయతీ ఎన్నికలు
‘జరగబోయేటువంటి పంచాయతీ రాజ్ ఎన్నికల కొరకు 2011 జనాభా గణన ఆధారంగా ఎస్టీల రిజర్వేషన్లు 6.77 శాతం గానూ, ఎస్సీ రిజర్వేషన్లు 19.08 శాతం గానూ, బీసీలకు 34 శాతం అలా మొత్తంగా 59.85 శాతం రిజర్వేషన్లు దామాషా ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పాటిస్తూ ఏపీ పంచాయతీ రాజ్ చట్టం–1994 ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రి మండలి తీర్మానించడం జరిగింది’.
108, 104 సర్వీసులు
‘రాష్ట్రంలో నాడు వైయస్ రాజశేఖర్రెడ్డి గారు దేశంలో ప్రప్రథమంగా.. ప్రమాదవశాత్తూ ఎవరైనా యాక్సిడెంట్ జరిగితే సకాలంలో వారిని ఆస్పత్రులకు తరలించక పోవడం వల్ల జరిగే మరణాలను అరికట్టాలని చెప్పి, ఏదన్నా ప్రమాదం జరిగిన 20 నిమిషాల్లోపు అంబులెన్సు పంపించి ఆ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలు నిలపొచ్చు అన్న ఒక ఆలోచనతో 108 సర్వీసును డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి గారు ప్రవేశపెడితే, గత 5 సంవత్సరాలుగా చూశాం.. ఈ 108 సర్వీసులంతా కూడా మూలన పడి, టైర్లు లేక, టైర్లలో గాలి లేక, చక్రాల్లేక, ఇంజన్లో ఆయిల్ లేక, లేదా బండి కాలం తీరిపోయి తగలబడి పోవడం, జీతాల్లేక డ్రైవర్లు సమ్మెలోకి వెళ్లడం, అలా ఎంతో మంది ప్రాణాలు నిలపాల్సినటువంటి 108 వాహనాలకు అష్టకష్టాలు ఎదురుచేసిన పాలనను మనం చూశాం’.
కొత్త వాహనాల కొనుగోలు
‘దాని కొరకే మళ్లీ రాజశేఖర్రెడ్డి గారి ఆలోచనను తద్వారా వేలాది మంది ప్రాణాలు నిలపడం కోసం 412 సరికొత్త 108 సర్వీసు వాహనాలను 2020 మార్చి 31 లోగా రూ.71,48,29,878 కోట్లతో కొనుగోలుకు అనుమతి మంజూరు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. దీంతో 13 జిల్లాలలో 108 సర్వీసు కొత్త వాహనాలు అందుబాటులోకి రానున్నాయి’.
‘అలాగే ఆరోగ్య పరీక్షలు నిర్వహించే 104 సర్వీసులు 656 వాహనాలను రవాణా వ్యయంతో కలిపి మొత్తం రూ.60,51,43,600ల ఖర్చుతో 2020 మార్చి 31లోగా కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వాటితో మొత్తం 13 జిల్లాల్లోని అన్ని మండలాలకు 104 సర్వీసు వాహనాలు అందుబాటులోకి రానున్నాయి’.
వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో కొత్త పాలసీ
‘వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలులో ఒక కొత్త విధానాన్ని ఆమోదించడం జరిగింది. రాష్ట్రంలో 191 మార్కెట్ యార్డులను శాశ్వత కొనుగోలు కేంద్రాలు గానూ, అలాగే 150 ఉప మార్కెట్ యార్డులను కూడా శాశ్వత కొనుగోలు కేంద్రాలుగానూ.. అంటే వెరసి 341 శాశ్వత కొనుగోలు కేంద్రాలను నడపాలని చెప్పి, కేవలం కోతల సమయంలోనో, వ్యవసాయ ఉత్పత్తులు, పంటలు చేతికొచ్చే సమయంలోనే కాకుండా 365 రోజులు కూడా ఈ 341 శాశ్వత కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉండేలాగా ఏర్పాటు కొరకు మంత్రి మండలి తీర్మానం చేయడమే కాకుండా, కనీస మద్దతు ధరకు నోచుకోనటువంటి పసుపు, మిర్చి, ఉల్లి, చిరుధాన్య పంటలు (కొర్ర, అండుకొర్ర, అరిక, వారిగ, ఊద, సామ) ఈరోజు ఉన్నాయి’.
‘వాటి కొరకు మద్దతు ధర. ప్రతి సంవత్సరం కూడా మద్దతు ధరను ముందే ప్రకటించి, అంటే పసుపుకు కానీ, మిర్చికి కానీ, ఉల్లికి కానీ, చిరు ధాన్యాలకు కానీ మద్దతు ధరను ముందే ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి కూడా ఈ కొత్త వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోల విధానం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని చెప్పి రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది’.
నాలుగు పంటలకు ఎమ్మెస్పీ
‘ఈ ఏడాది క్వింటాలు మిర్చి కనీస మద్దతు ధర రూ.7 వేలు, క్వింటాలు పసుపు మద్దతు ధర రూ.6350, అలాగే ఉల్లి కనీస మద్దతు ధర రూ.780, చిరుధాన్యాల కనీస మద్దతు ధర రూ.2500 గా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం ఇచ్చింది. అదే విధంగా టమోటా, చీనీ, అరటి, నిమ్మ పంటలకూ మద్దతు ధర ప్రకటించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వీటన్నింటికీ విధి విధానాలు ఖరారు చేయాలంటూ వ్యవసాయ మార్కెట్ శాఖను ఆదేశించడం జరిగింది’.
భూ కేటాయింపులు
‘అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో 6 ఎకరాల 4 సెంట్లను ఆర్ఎస్ నెం:377–3 లో అక్కడ, ఎకరా రూ.43 లక్షల మార్కెట్ విలువ ఉన్నప్పటికీ ఎకరా లక్ష రూపాయల చొప్పున ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థకు కేటాయిస్తూ తీర్మానించడం జరిగింది. అలాగే వైయస్సార్ కడప జిల్లా రాయచోటిలో 4 ఎకరాలను రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు భూబదలాయింపు చేస్తూ కూడా మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది’.
మచిలీపట్నం పోర్టు
‘మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైట్స్ నిర్మాణ సంస్థకు బాధ్యత అప్పగిస్తూ ఇన్క్యాబ్ సీఎండీ గారు తీసుకున్న నిర్ణయాన్ని రాటిఫై చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్మాణం చేయడం కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)ను ఏర్పాటు చేయడం కోసం ఇన్క్యాబ్ సీఎండీ గారికి అనుమతి మంజూరు చేస్తూ తీర్మానం చేయడం జరిగింది’.
రామాయపట్నం పోర్టు
‘రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు సముద్ర ముఖపరిధిని కుదిస్తూ, రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది. కృష్ణపట్నం పోర్టు సముద్ర ముఖపరిధి కుదించడం చేయడం ద్వారా రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అడ్డంకి తొలగుతున్నందుకు, ఇది ఒక ముందడుగుగా భావిస్తూ రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది’.













