Minister Narayana: అవసరమా.. నారాయణా..?

ఏపీ రాజకీయాల్లో పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను (SVSN Varma) ఉద్దేశించి మంత్రి నారాయణ (Minister Narayana) చేసినట్లుగా భావిస్తున్న ‘జీరో’ వ్యాఖ్యలు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గెలుపు కోసం తన సీటును త్యాగం చేసిన వర్మకు, జనసైనికులు, కొందరు కూటమి నాయకుల నుంచి ఇప్పటికే అవమానాలు ఎదురవుతున్నాయి. తాజాగా మంత్రి నారాయణ వ్యాఖ్యలతో పిఠాపురం టీడీపీలో (TDP) అసంతృప్తి తీవ్రస్థాయికి చేరింది.
పిఠాపురం టీడీపీలో వర్మ బలమైన నేతగా గుర్తింపు పొందారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రికార్డు ఆయనకుంది. 2024 ఎన్నికల్లో కూటమి ఒప్పందంలో భాగంగా ఈ సీటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కేటాయించారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలు, ముఖ్యంగా ఎమ్మెల్సీ పదవి హామీతో వర్మ తన సీటును త్యాగం చేశారు. పవన్ కల్యాణ్ విజయం కోసం ఆయన, ఆయన అనుచరులు క్రియాశీలకంగా పనిచేశారు. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత పిఠాపురంలో టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య సమన్వయం లోపించింది. ముఖ్యంగా వర్మకు, ఆయన అనుచరులకు జనసైనికుల నుంచి సరైన గౌరవం దక్కలేదనే ఆరోపణలు వచ్చాయి. జనసేన నేత, పవన్ సోదరుడు నాగబాబు వంటి నాయకులు సైతం పరోక్షంగా వర్మను ఉద్దేశించి సెటైర్లు వేయడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది. అధిష్ఠానం ఆదేశాలకు కట్టుబడి వర్మ మౌనం వహించినప్పటికీ, ఆయన వర్గీయుల్లో అసహనం పెరిగింది.
ఈ నేపథ్యంలో, మంత్రి నారాయణ కొందరితో మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఆడియోలో, పిఠాపురంలో కూటమిలో జరుగుతున్న అంతర్గత విభేదాల గురించి ప్రస్తావిస్తూ… “వర్మ చాలా దూకుడు ఉన్న వ్యక్తి. పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత, మన పార్టీ నేత (వర్మ)తో వాళ్లకు (జనసైనికులకు) ఘర్షణ జరుగుతోంది. గత మూడు నాలుగు నెలల నుంచి అతన్ని (వర్మను) జీరో చేశాం” అన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వర్మకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. తాను చంద్రబాబు, లోకేశ్‌ల ఆదేశాల మేరకే మౌనంగా ఉన్నానని, పార్టీ బలోపేతం కోసమే ఎటువంటి విమర్శలకూ సమాధానం చెప్పడం లేదని వర్మ స్పష్టం చేశారు. “ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో గడ్డిపరక అంటే నాకేంటి. వర్మ అంటే ఏమిటో పిఠాపురం ప్రజానీకానికి తెలుసు” అంటూ మంత్రి నారాయణపై పరోక్షంగా సెటైర్లు వేశారు. తాను టీడీపీలో పిల్లర్ లాంటి వాడినని కూడా స్పష్టం చేశారు.
వివాదం పెద్దదై, కూటమిలో ప్రకంపనలు సృష్టించడంతో మంత్రి నారాయణ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన మాటలను వక్రీకరించారని, తాను పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య ఉన్న విభేదాలను ‘జీరో’ చేశామని మాత్రమే చెప్పానని వివరణ ఇచ్చుకున్నారు. సోషల్ మీడియాలో కట్ అండ్ పేస్ట్ చేసి ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈ అంశంపై విశాఖ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణను వర్మ కలిసి చర్చించారు. ఈ భేటీ తర్వాత వర్మ మాట్లాడుతూ.. మంత్రి నారాయణపై వస్తున్న వార్తలు అసత్య ప్రచారాలని కొట్టిపారేశారు. పేటీఎం బ్యాచ్ చేసే అసత్య ప్రచారాలను నేను పట్టించుకోనని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన సమన్వయంతోనే పనిచేస్తున్నాయని, మంత్రి నారాయణ కాకినాడ జిల్లాలో వారధిగా పనిచేస్తున్నారని వర్మ ప్రకటించడం గమనార్హం.
మొత్తంగా, మంత్రి నారాయణ వ్యాఖ్యలు కూటమిలోని వర్గపోరును ముఖ్యంగా టీడీపీ పరిస్థితిని మరోసారి బట్టబయలు చేశాయి. వర్మ త్యాగాన్ని కొందరు నాయకులు తేలికగా తీసుకుంటున్నారనే భావన టీడీపీ శ్రేణుల్లో బలపడింది. హైకమాండ్ జోక్యంతో ఈ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినప్పటికీ, వర్మ విషయంలో అధిష్ఠానం హామీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి, ఆయనకు దక్కాల్సిన గౌరవం లభించకపోతే పిఠాపురం టీడీపీలో అసంతృప్తి రాజుకునే ప్రమాదం లేకపోలేదు. ఈ పరిణామాలు కూటమి సమన్వయానికి సవాల్‌గా నిలుస్తున్నాయి.