Free Bus Scheme: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..మంత్రి నారాయణ స్పష్టత..

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పై గత కొద్ది కాలంగా చర్చలు జరుగుతున్నాయి ఎన్నికల సమయంలో ప్రజలతో హామీ ఇచ్చిన ఈ పథకం అమలు గురించి ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ (Narayana) తాజా ప్రకటనతో ఈ విషయంపై క్లారిటీ వచ్చింది.
అనంతపురం (Anantapuram) జిల్లాలో జరుగుతున్న “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. వచ్చే నెల 15వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేసిన హామీని ఇప్పుడే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఎన్నికల ముందు కూటమి పార్టీలు ప్రకటించిన “సూపర్ సిక్స్” (Super six) హామీలలో ఇది కీలక అంశం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తాము అన్న హామీని అధికారంలోకి వచ్చిన కూటమి మర్చిపోలేదని, దాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన నిర్ణయాన్ని తీసుకోవడంలో జాప్యం జరిగిందని మంత్రి నారాయణ తెలిపారు. అయితే ఇది కేవలం మిగిలిన రాష్ట్రాలలో ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలను అధ్యయనం చేసి, ఏపీలో ఎటువంటి లోపాలు లేకుండా సక్రమంగా అందించే దిశగా తీసుకున్న సమయంగా ఆయన వివరించారు.
తెలంగాణ (Telangana) ,కర్ణాటక (Karnataka) లో ఇప్పటికే అమలులో ఉన్న ఉచిత బస్సు పథకాలపై సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాదు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ఏదైనా అంశాన్ని మధురలోకి తీసుకురావాలి అంటే అన్ని విధాల ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు అని మరొకసారి గుర్తు చేశారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా వదిలిపెట్టకుండా ప్రభుత్వ యంత్రాంగం పని చేస్తోందని చెప్పారు.
ఇప్పటికే దీనికి సంబంధించిన సాంకేతిక, పరిపాలన అంశాలపై పలు రకాల చర్చలు జరగడంతో పాటు ఇది ఆంధ్రాలో ఏ రకంగా ప్రవేశపెట్టాలి అనే విషయంపై అధ్యయనాలు కూడా పూర్తి అయ్యాయి. కాబట్టి ఇక ఈ స్కీమ్ అమలు కావడంలో ఎలాంటి ఆటంకాలు ఉండవని తెలుస్తోంది. గతంలో ఈ పథకం ఆలస్యంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఇప్పుడు మంత్రి స్థాయిలో స్పష్టత ఇవ్వడం, ముఖ్యమంత్రి కూడా ఇటీవలి ప్రకటనల్లో ఈ హామీపై స్పందించడం, నిజంగానే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చే సూచనలు స్పష్టమవుతున్నాయి.