ఏపీలో లక్ష ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం : లోకేశ్
2019లో రాష్ట్రంలో ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విజయవాడలో ఏడు ఐటీ కంపెనీలను లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మంత్రి పదవి చేపట్టిన 90 రోజుల్లోనే 3వేల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. కంపెనీలు ప్రారంభించడం వల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. చిన్న సంస్థలను ప్రోత్సహిస్తే పెద్ద కంపెనీలుగా మారుతాయన్నారు. ప్రపంచంలో ఏ కంపెనీలో చూసిన అధిక శాతం మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతే ఉంటున్నారని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఐటీ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ తరహాలో సాఫ్ట్వేర్ సంస్థలన్నీ ఒకేచోట ఉండేలా విజయవాడ, విశాఖలో ఐటీ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా పాలసీలు రూపొందించామని అన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రానికి పెద్ద ఐటీ కంపెనీలు రాయనున్నాయని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ నెలాఖరుకల్లా అమరావతి నుంచి హెచ్‌సీఎల్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు.













