ఐటిలో ఆంధ్రప్రదేశ్‌ని మేటిగా నిలుపుతాం
టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని పరిశ్రమలు, ఐ.టీ, వాణిజ్య, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. వచ్చే మూడేళ్లలోనే ఆ లక్ష్యాన్ని అందుకునే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. హైదరాబాద్ లోని నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమెజాన్ ప్రతినిధులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశం అయ్యారు.
ఈ సందరద్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారత, మహిళలను పారిశ్రామికవేత్తలుగా మలచాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వప్నమన్నారు. రాష్ట్రంలో రానున్న 30 నైపుణ్య కాలేజీలలో.. ఒకచోట అమెజాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నామన్నారు. పరిపాలనలో వినూత్న ఆలోచన అమలుకు శ్రీకారం చుడుతున్నామని, ఐ.టీ రంగంలో రాణిస్తున్నది ఎక్కువగా తెలుగువారేనని అన్నారు. ఎక్కడెక్కడో ఉన్నవారంతా ఏపీకి తిరిగి వచ్చే స్థాయిలో ఐ.టీ అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాలనలో ఐ.టీ ద్వారా సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు. చిన్న చిన్న ఆలోచనలతో సమయం, వ్యయాల ఆదా చిన్న సంస్కరణలతోనే ఊహించని అభివృద్ధికి అవకాశం ఉందన్నారు. పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, టెక్నాలజీతో సంక్షేమం, పథకాలను ప్రజల ఇళ్లకు చేరుస్తాం. వినూత్న ఆలోచనలు కొత్త టెక్నాలజీ ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు పెద్దపీట వేస్తామన్నారు. ఐఎస్ బీ, అమెజాన్ ల భాగస్వామ్యంతో ప్రజల ప్రాథమిక హక్కులను మరింతగా నెరవేరుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహిళల కోసం సహేలి…
ఈ సందర్భంగా అమెజాన్ నేతృత్వంలో సాధికారతతో పాటు మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చే ‘సహేలి’ కార్యక్రమం గురించి అమెజాన్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. హస్తకళలు, బొమ్మల తయారీ, వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసే మహిళలను ప్రోత్సహించడమే సహేలి గా పేర్కొన్నారు. స్థానికంగా తయారయ్యే వస్తువులకు మార్కెటింగ్, శిక్షణ, ప్రోత్సాహం, అమ్మకం వరకూ అన్నింటిలో ఆసరా అందిస్తామన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో విప్లవాత్మక మార్పులపై అమెజాన్ దృష్టి పెట్టిందన్నారు.
భాగస్వామ్యంపై చర్చ
నైపుణ్యం, స్టార్ట్ అప్, మెషిన్ లెర్నింగ్, డేటా సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంటర్నెట్, వర్క్ ఫ్రమ్ హోమ్, సెన్సార్ ఆధారిత టెక్నాలజీలలో అమెజాన్ భాగస్వామ్యానికి అవకాశాలపై చర్చించారు. ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ వర్చువల్ సమావేశానికి హాజరయిన ఐ.టీ శాఖ కార్యదర్శి భాను ప్రకాశ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సుందర్, ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (AISPL) సంస్థ ఎండీ, రాహుల్ శర్మ, స్టేట్స్ అండ్ లోకల్ గవర్నమెంట్ విభాగాధిపతి అజయ్ కౌల్, పబ్లిక్ పాలసీ హెడ్, లొబొ, సొల్యుషన్స్ ఆర్కిటెక్చర్ విభాగం, దుర్గాప్రసాద్ కాకరపర్తి పాల్గొన్నారు.













