Nara Lokesh: పెద్ద కంపెనీలకు త్వరితగతిన అనుమతులు: మంత్రి లోకేశ్
రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్దంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ (IT, Electronics) శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ పెద్ద కంపెనీలకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేసేందుకు ప్రతి కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్ (Nodal Officer )ను నియమించాలని అధికారులను ఆదేశించారు. విశాఖ నగరాన్ని అత్యాధునిక సాంకేతికతల కేంద్రంగా, ఐటీ హబ్ (IT Hub)గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో యూనిట్ల స్థాపనకు ఆసక్తి చూపుతున్న కంపెనీల పెట్టుబడులు, ఉద్యోగాలపై మంత్రి సమీక్షించారు. ఇప్పటి వరకు 91 ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రూ.91,839 కోట్ల పెట్టుబడులు, 1,41,407 ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయన్నారు. వాటికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా కంపెనీలు ఏర్పాటు చేసేలా సంబంధిత పరిశ్రమల ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.













