Vangaveeti Radha: వంగవీటి రాధాకు ఏ పదవి దక్కబోతోంది..!?

బుధవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా (Vangaveeti Radha ) మంత్రి నారా లోకేష్‌తో (Nara Lokesh) భేటీ అయ్యారు. ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సమావేశం వివరాలు బయటకు రాకపోయినా దాదాపు గంటసేపు వాళ్లు భేటీ కావడంతో రాజకీయ అంశాలే ప్రధాన అజెండా అయి ఉంటాయని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో తన సీటును త్యాగం చేసిన రాధాకు త్వరలో కీలక పదవి దక్కనుందని అనుచరులు భావిస్తున్నారు. అయితే, ఏ పదవి అవుతుందనే దానిపై స్పష్టత లేదు.
వంగవీటి కుటుంబానికి ఏపీ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. విజయవాడ లోకల్ రాజకీయాల్లో గట్టి పట్టున్న నేత రాధా. గత ఎన్నికల్లో ఆయన విజయవాడ ఈస్ట్ నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేయాలనుకున్నారు. కానీ సమీకరణాల్లో అది కుదరలేదు. దీంతో ఆయన త్యాగాన్ని గుర్తించిన పార్టీ అధినేత చంద్రబాబు, ఆయనకు కీలక పదవి ఇస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ కావడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎమ్మెల్సీ పదవి కూడా ఆయనకు దక్కలేదు. ఇది రాధా అనుచరుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంతవరకూ ఆయన పదవి ఇవ్వలేదని ఆయన అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు.
అయితే రాధా మాత్రం పార్టీ పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. పలుమార్లు చంద్రబాబు, లోకేశ్.. రాధాతో సమావేశమయ్యారు. తాజాగా నారా లోకేశ్ తో రాధా సమావేశం కావడంతో మళ్లీ పదవిపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే రాధా ఆరోగ్యంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై లోకేశ్ చర్చించినట్లు సమాచారం. అయితే భేటీ వివరాలేవీ అధికారికంగా బయటకు రాలేదు. అయితే అనూహ్యంగా రాధాకు పిలుపు రావడంతో త్వరలోనే ఆయనకు కీలక పదవి రాబోతోందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఇచ్చేందుకు ఇంకా సమయం పడుతుండడంతో మరేదైనా కీలక పదవిని రాధాకు ఇస్తారేమోననే చర్చ మొదలైంది. వచ్చే ఏడాది వరకూ ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే అవకాశం లేదు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా మండలి ఛైర్మన్ మోషేన్ రాజు వాటిని ఆమోదించలేదు. దీంతో వాటికి ఎన్నిక జరిగే అవకాశం లేదు. కాబట్టి ఏదైనా కేబినెట్ ర్యాంకుతో కూడిన పదవిని వంగవీటి రాధాకు ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నిస్తోందనే టాక్ అమరావతిలో బలంగా వినిపిస్తోంది.