ధర్మప్రచార వారోత్సవాలు
సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు నిర్వహిస్తున్న ధర్మ ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాలతో పాటు 6-ఎ ఆలయాల్లోనూ నిర్వహించేందుకు నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన ధర్మప్రచార పరిషత్ సమావేశం జరిగింది.
గత నెల 6న అన్నవరంలో, 18న శ్రీకాళహస్తిలో ధర్మప్రచార మాసోత్సవాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ నెల 16న కాణిపాకం ఆలయంలో కూడా దీనిని మొదలు పెట్టనున్నట్లు చెప్పారు. దేవాదాయశాఖ పరిధిలో ఉన్న 115 ముఖ్య ఆలయాల్లో అక్టోబరు నుంచి వచ్చే ఏడాది మార్చి మధ్య వారోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ధర్మప్రచారంలో భాగంగా ప్రవచనాలు, హరికథలు, భజనలు, కోలాటాలు, పారాయణలు ఉంటాయని వెల్లడించారు. సామూహిక ఉచిత కుంకుమ పూజలు, అభిషేకాలు, సరస్వతీ హోమాలు, గోపూజలు, కళ్యాణోత్సవాలు ఉండాలని తెలిపారు. నగర, గ్రామ సంకీర్తనలు, శోభాయాత్రలు నిర్వహించాలని సూచించారు. పాఠశాలల విద్యార్థులకు పురాణ పాత్రలు, భగవద్గీతపై వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు. గిరిజన, మత్స్యకార, బీసీలు నివసించే ప్రాంతాల్లోకి ధర్మప్రచార రథాలు వెళ్లాలని ఆదేశించారు. సమావేశంలో దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, కమిషనర్ ఎస్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.













