Minister: బొత్స కాళ్లు మొక్కిన టీడీపీ మంత్రి.. కేడర్ షాక్..!!
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం (TDP), వైసీపీ (YCP) నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. తమను తొక్కేస్తున్నారని.. అనవసరంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ నేతలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమను ముప్పతిప్పలు పెట్టారని.. టీడీపీ అధికారంలోకి వచ్చినా వాళ్లపై చర్యలు తీసుకోవట్లేదని తెలుగు తమ్ముళ్లు ఫుల్ ఫైర్ లో ఉన్నారు. పైగా వైసీపీ నేతలతో కొంతమంది లోపాయకారీ ఒప్పందాలు చేసుకుని చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారని మండిపడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ హైకమాండ్ పై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాము అనుకున్నట్టు పాలన సాగట్లేదనేది వాళ్ల బాధ. పైగా కొంతమంది టీడీపీ నేతలు తెరవెనుక వైసీపీ నేతలకు అనుగుణంగా పని చేస్తున్నారనేది వాళ్ల ఫిర్యాదు. పేర్ని నానిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక కొంతమంది టీడీపీ నేతల హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఏకంగా టీడీపీ మంత్రి ఒకరు వైసీపీ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకోవడం సంచలనం కలిగిస్తోంది.
రెండ్రోజుల కిందట విశాఖ ఎయిర్ పోర్టులోని లాంజ్ లో బొత్స సత్యనారాయణ కూర్చొని ఉన్నారు. ఈ సమయంలో లాంజ్ లోకి ఎంటరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas).. బొత్స దగ్గరకు వెళ్లి కాళ్లకు నమస్కరించారు. బొత్స ఆయన్ను ఆశీర్వదించారు. ఈ సంఘటన అక్కడున్న ఎమ్మెల్యేలను ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఏంటిది.. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు.. అని ప్రశ్నించారు కూడా..! అయితే దానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చాలా తాపీగా సమాధానం చెప్పారు. తమది రాజకీయాలకు అతీతమైన బంధం అని.. ఆయన తనకు గురువు లాంటి వారని చెప్పుకొచ్చారు. దీంతో అక్కడున్న ఎమ్మెల్యేలు మరోసారి షాక్ కు గురయ్యారు.
ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య స్నేహం ఉండొచ్చు.. కానీ అది బహిరంగంగా ఉండకూడదు. అలా ఉంటే కేడర్ తట్టుకోలేదు. ఇలాంటి వాటిని అస్సలు జీర్ణించుకోలేదు. కొండపల్లి శ్రీనివాస్ బొత్స కాళ్లపై పడ్డారని తెలియగానే తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. వాస్తవానికి ఎన్నికలకు రెండు నెలల ముందు కొండపల్లి శ్రీనివాస్ వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు. యువ కేటగిరీలో ఆయనకు గజపతినగరం (Gajapati Nagaram) సీటు దక్కింది. అదే కోటాలో మంత్రి కూడా అయ్యారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడాన్ని జిల్లాలో పలువురు నేతలకు ఇష్టం లేదు. అయినా హైకమాండ్ ఇచ్చింది. దాన్ని సక్రమంగా వినియోగించుకోకుండా ఇలాంటి పనులు చేస్తుండడం ఇప్పుడు తెలుగుదేశం నేతలకు అస్సలు మింగుడు పడడం లేదు. కొండపల్లి శ్రీనివాస్ కు ఇంకా పాత వాసనలు పోయినట్లు లేవని చెప్పుకుంటున్నారు.













