షోకాజ్ నోటీసుపై స్పందించిన మంత్రి కొడాలి నాని…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను కించపరిచే ఉద్దేశం తనకు లేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో ఎస్ఈసీ జారీ చేసిన షోకాజ్ నోటీసుపై స్పందించిన కొడాలి నాని.. ఎస్ఈసీకి లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఎస్ఈసీ పట్ల తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీ అరాచకాలను బయటపెట్టడంలో భాగంగానే మీడియా సమావేశం నిర్వహించినట్లు వివరించారు. ఎన్నికల కమిషన్‌ను తప్పు పట్టాలన్న దురుద్దేశాలు తనకు లేవని రాజ్యాంగబద్దమైన సంస్థలపై తనకు గౌరవం ఉందన్నారు. తనపై జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని ఎస్ఈసీకి మంత్రి విజ్ఞప్తి చేశారు.













